ODI World Cup 2023 : డబుల్ ధమాకా.. నేడు రెండు మ్యాచ్‌లు

Byline :  Veerendra Prasad
Update: 2023-10-10 02:20 GMT

వరల్డ్‌ కప్‌ టోర్నమెంట్‌ 2023 లో భాగంగా ఇవాళ రెండు మ్యాచ్‌ లు జరుగనున్నాయి. మొదటి మ్యాచ్.. ఇంగ్లాండ్‌ మరియు బంగ్లాదేశ్‌ జట్ల మధ్య హిమచల్ ప్రదేశ్ లోని ధర్మశాల వేదికగా జరుగనుంది. ఈరోజు(మంగళవారం) ఉదయం 10:30 గంటలకే మ్యాచ్ ప్రారంభం కానుంది. గత ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన ఇంగ్లాండ్ (England Cricket Team).. ఈసారి మొదటి వరల్డ్ కప్ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌తో ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు తన రెండవ మ్యాచ్‌లో.. బంగ్లాదేశ్‌పై గెలుపు సాధించేందుకు సిద్ధమైంది. మరోవైపు ఈ టోర్నీని విజయంతో బంగ్లాదేశ్... ఇంతకుముందు ఇదే స్టేడియం(ధర్మశాల)లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించింది. ఈ మ్యాచ్‌లో గెలవడానికి ఇంగ్లండ్ గట్టి పోటీదారుగా ఉన్నప్పటికీ, బంగ్లాదేశ్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం.ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకు ఇంగ్లండ్, బంగ్లాదేశ్ మధ్య మొత్తం 4 మ్యాచ్‌లు జరగగా, ఇందులో ఇరు జట్లు తలో 2 మ్యాచ్‌లు గెలిచాయి. 2007, 2019 ప్రపంచకప్‌లలో ఇంగ్లండ్ బంగ్లాదేశ్‌ను ఓడించగా, 2011, 2015 ప్రపంచకప్‌లలో బంగ్లాదేశ్ గెలిచింది. వన్డే మ్యాచ్ ల ప్రకారం చూసుకుంటే... ఇప్పటి వరకు జరిగిన మొత్తం 24 వన్డేల్లో ఇంగ్లండ్‌ 19, బంగ్లాదేశ్‌ 5 గెలిచాయి.




 


ఇక రెండవ మ్యాచ్ పాకిస్థాన్‌, శ్రీలంక జట్ల మధ్య హైదరాబాద్ ఉప్పల్‌ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మెగా టోర్నీలో నెదర్లాండ్స్‌పై సాధికార విజయంతో బాబర్‌ సేన బోణీ కొట్టగా.. దక్షిణాఫ్రికా చేతిలో లంక జట్టు 102 పరుగుల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. దీంతో ఎలాగైనా పాకిస్థాన్‌పై భారీ తేడాతో గెలవాలని లంక భావిస్తోంది. మరోవైపు ఆసియా కప్‌లో ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన సూపర్‌-4 మ్యాచ్‌లో లంక చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్‌ కసితో ఉంది. మైదానంలో ఇరు జట్ల మధ్య రసవత్తర పోరు జరిగే అవకాశముంది. అయితే ఈ వరల్డ్ కప్ టోర్నీలో హైదరాబాద్‌లో జరిగే చివరి మ్యాచ్ ఇదే కావడం తెలుగు రాష్ట్రాల క్రికెట్ ఫ్యాన్స్‌కు కాస్త నిరాశను కలిగిస్తోంది.





Tags:    

Similar News