World Cup 2023 : పేలవ ప్రదర్శన... శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు

Byline :  Veerendra Prasad
Update: 2023-11-06 06:35 GMT

భారత్ వేదికగా జరుగుతున్న క్రికెట్ మహా సంగ్రామం కొందరికి వినోదాన్ని పంచుతుంటే, మరికొందరికి తీవ్ర శోకాన్ని మిగిల్చుతోంది. ముఖ్యంగా భారత్‌ చేతిలో ఘోర పరాభవం చవిచూసిన శ్రీలంక జట్టుపై (IND vs SL) ఆ దేశ క్రికెట్ అభిమానులు విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఈ క్రమంలోనే ఆ దేశ క్రీడా మంత్రి ప్రకటన మేరకు శ్రీలంక క్రికెట్‌ బోర్డు సెక్రటరీ రాజీనామా మోహన్ డిసిల్వా తన పదవికి రాజీనామా చేశారు కూడా.

తాజాగా ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న క్రికెట్‌ బోర్డును (SLCB) రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు క్రీడల మంత్రి రోషన్ రణసింగే వెల్లడించారు. మాజీ కెప్టెన్ అర్జున్‌ రణతుంగ నేతృత్వంలో తాత్కాలిక కమిటీని నియమిస్తున్నట్లు ఓ ప్రకటనను మంత్రిత్వ శాఖ కార్యాలయం విడుదల చేసింది. ఏడుగురు సభ్యులు కలిగిన ఈ ప్యానెల్‌లో సుప్రీం కోర్డు విశ్రాంత న్యాయమూర్తి కూడా ఉన్నారు. పాత బోర్డు కార్యదర్శిగా పని చేసిన మోహన్ డి సిల్వా రాజీనామా చేసిన మరుసటి రోజే ఈ నిర్ణయం వెలువడింది. వరల్డ్‌ కప్‌లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్‌తో శ్రీలంక (SL vs BAN) తలపడనుంది. మ్యాచ్‌కు ముందు ఇలాంటి నిర్ణయం వెలువడటం గమనార్హం.

శ్రీలంక క్రీడల మంత్రి రోషన్‌ రణసింగే మాట్లాడుతూ.. ‘‘బోర్డులోని సభ్యులకు పదవిలో ఉండే నైతిక హక్కు లేదు. తక్షణమే వారంతా స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే బాగుండేది. బోర్డులో అవినీతి మితిమీరింది. దీంతో బోర్డును తొలగించాల్సిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది’’ అని వెల్లడించారు. ఘోర ఓటములతో బోర్డుపై విమర్శలు రావడంతో కార్యాలయంపై దాడి జరిగే అవకాశం ఉందని భావించిన కొలంబో పోలీసు యంత్రాంగం బందోబస్తు ఏర్పాటు చేసింది.

ఈ టోర్నీలో ఇప్పటివరకూ శ్రీలంక ఏడు మ్యాచ్‌లు ఆడగా.. రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. , భారత్‌తో జరిగిన మ్యాచ్ లో లంక ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. 358 పరుగుల లక్ష్య ఛేదనలో 55 పరుగులకే కుప్పకూలి.. వరల్డ్‌ కప్‌ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నారు. ఇక మిగిలిన మ్యాచ్‌ల్లో విజయం సాధించి పరువు నిలబెట్టుకోవడం తప్ప సెమీస్ చేరే అవకాశాలు లేవు.




Tags:    

Similar News