Asian Games: నేపాల్ వరల్డ్ రికార్డ్.. యువరాజ్ సింగ్ రికార్డ్ బద్దలు
"నేపాల్ చరిత్ర సృష్టించింది." చరిత్ర పుస్తకాలకు పట్టిన దుమ్ము దులిపేసింది. (Asian Games) తమ ఆట మొదలుపెట్టామని ప్రపంచ క్రికెట్కు హెచ్చరిక పంపించింది. తమను పసికూన అని అన్నవాళ్లకు సవాల్ విసిరింది. వరల్డ్ రికార్డ్.. కాదు కాదు రికార్డ్స్ ను తిరగరాసింది. (Nepal creates history) ఏషియన్ గేమ్స్ లో భాగంగా.. పురుషుల క్రికెట్ లో తొలిరోజే రికార్డుల మోత మోగిపోయింది. నేపాల్- మంగోలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో.. విధ్వంసం జరిగింది. మంగోలియా బౌలింగ్‌లో నేపాల్ బ్యాటర్లు చెలరేగిపోయారు. దాంతో.. ఇక ఎప్పటికీ సాధ్యం కావు అనుకున్న రికార్డ్ లు చెరిగిపోగా.. ఐదు అంతర్జాతీయ రికార్డులను నమోదయ్యాయి. చైనా వేదికగా జరుగుతున్న 19వ ఏషియన్ గేమ్స్ లో.. నేపాల్- మంగోలియా మధ్య బుధవారం పురుషుల టీ20 మ్యాచ్లు ప్రరంభం అయ్యాయి. టాస్ గెలిచిన మంగోలియా బౌలింగ్ ఎంచుకుంది. ఓపెనర్లుగా వచ్చిన కుశాల్ భుర్తేల్ (19), ఆసిఫ్ షేక్ (19) ఔట్ అయి.. ఆరంభంలోనే నేపాల్ కు షాక్ ఇచ్చారు. మూడో వికెట్ లో కుశాల్ మల్లా రాగానే సీన్ రివర్స్ అయింది.
*టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నేపాల్ అవతరించింది. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. 2019లో ఆఫ్ఘనిస్థాన్ ఐర్లాండ్ పై 278/3 పరుగులు చేసింది. ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ స్కోర్ కాగా.. దాన్ని నేపాల్ అదిగమించింది.
* ఆకాశమే హద్దుగా రెచ్చిపోయిన కుశాల్ మల్లా.. 34 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 50 బంతుల్లో 137 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లు, 12 సిక్సర్లు ఉన్నాయి. దీంతో క్రికెట్ లో అత్యంత వేగంగా సెంచరీ కొట్టిన వ్యక్తిగా కుశాల్ అవతరించాడు. ఇది వరకు ఈ రికార్డ్ సౌతాఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ పేరిట ఉండేది. 2017లో బంగ్లాదేశ్ పై 35 బంతుల్లోనే సెంచరీ చేశాడు.
* 9 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు దీపేంద్ర సింగ్ ఐరీ. 10 బంతుల్లో 52 పరుగులు చేసిన దీపేంద్ర.. 8 సిక్సర్లు కొట్టాడు. దీంతో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ కొట్టిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ టీమిండియా ఆటగాడు యువరాజ్ సింగ్ పేరిట ఉండేది. యువీ 2007లో ఇంగ్లండ్ పై ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేశాడు.
* ఈ మ్యాచ్ లో నేపాల్ బ్యాటర్లు ఏకంగా 26 సిక్సర్లు బాదారు. ఒక మ్యచ్ లో ఎక్కువ సిక్సర్లు కొట్టిన జట్టు ఇదే. గతంలో అఫ్గనిస్తాన్ ఐర్లాండ్ మీద 22 సిక్స్‌లు కొట్టింది.
* 315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మంగోలియా.. 41 పరుగులకే కుప్పకూలింది. దాంతో నేపాల్ 273 పరుగుల భారీ తేడాతో గెలిచిన జట్టుగా నేపాల్ అవతరించింది. ఇదివరకు ఈ రికార్డ్ చెక్ రిపబ్లిక్ పేరిట ఉండేది. టర్కీపై చెక్ రిపబ్లిక్ 257 పరుగుల తేడాతో గెలిచింది.