Yuvraj Singh : అశ్విన్ ఆడటం దండగ.. రిటైర్మెంట్ తీసుకుంటే సరి
రవిచంద్రన్ అశ్విన్.. ప్రపంచ క్రికెట్ లో మేటి స్పిన్నర్లలో ఒకడు. ఎంత ఒత్తిడి ఉన్నా.. తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తాడు. ప్రస్తుతం జట్టులో పోటీ ఎక్కువై, యువ క్రికెటర్లకు చాన్స్ ఇచ్చే నేపథ్యంలో అశ్విన్ వన్డే, టీ20 ఫార్మట్ కు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. వన్డే, టీ20 జట్టులో అశ్విన్ అనర్హుడని యువీ అభిప్రాయపడ్డాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అశ్విన్ భవితవ్యంపై యువీ మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశాడు.
‘ప్రపంచ క్రికెట్ లో అశ్విన్ గొప్ప బౌలర్. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం అతను వన్డే, టీ20 ఫార్మట్ కు అనర్హుడు. బాల్ తో అతని ప్రతిభను తక్కవ చేయలేం. అయితే బ్యాటుతో జట్టులో ఎలా సాయపడతాడు? ఫీల్డింగ్ లో అతని సత్తా ఎంత? అనేది ఆలోచించాలి. టెస్ట్ జట్టులో అశ్విన్ కచ్చితంగా ఉండాలి. కానీ లిమిటెడ్ ఓవర్స్ క్రికెట్ లో అతని అవసరం జట్టుకు ఏమాత్రం ఉంది అనేది చూసుకోవాల’ని యువీ చెప్పుకొచ్చాడు. 2011లో భారత్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు జట్టులో అశ్విన్, యువరాజ్ సభ్యులు. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ లో అశ్విన్ నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. టెస్ట్ ఆల్ రౌండర్ల జాబితాలో అతను రెండో స్థానంలో ఉన్నాడు.