Aditya L1 Mission : రేపే నింగిలోకి ఆదిత్య ఎల్-1.. ఫస్ట్ శాటిలైట్‌ ఇదే

Byline :  Veerendra Prasad
Update: 2023-09-01 01:34 GMT

చంద్రయాన్‌-3 మిషన్‌ను విజయవంతంగా నిర్వహించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఇప్పుడు సూర్యుడి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకునేందుకు సమాయత్తమైంది. ఆదిత్య–ఎల్‌1 లాంచ్‌ చేయడానికి సెప్టెంబర్ 2న ముహూర్తం ఖరారు చేశారు. సూర్యుడిని దగ్గరగా అధ్యయనం చేయడానికి భారతదేశం చేపడుతున్న మొట్టమొదటి మిషన్‌ ఇదే కావడం విశేషం. రేపు(సెప్టెంబర్ 2న) ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్‌-1 వ్యోమనౌకను సూర్యుడి చెంతకు ప్రయోగించనుంది. శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి పీఎస్‌ఎల్వీ సీ-57 రాకెట్‌ ద్వారా దీన్ని నింగిలోకి పంపించనున్నది. సూర్యుడిపై పరిశోధనల కోసం భారత్‌ ప్రయోగిస్తున్న మొదటి శాటిలైట్‌ ఇదే. సౌర వాతావరణాన్ని అధ్యయనం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం.

ఆదిత్య ఎల్‌1 ఉపగ్రహం ప్రయోగం ద్వారా సూర్యునిపై దాగి ఉన్న రహస్యాలను పరిశోధనలు చేయనుంది ఇస్రో. సౌర తుపాను సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. దీంతోపాటు ఫోటోస్పియర్, క్రోమోస్పియర్‌లపై అధ్యయనం చేసి సమాచారాన్ని సేకరించేందుకు ఈ ప్రయోగాన్ని నిర్వహించబోతున్నారు.




 


ఆదిత్య-ఎల్‌1గా పేరు పెట్టిన స్పేస్‌క్రాఫ్ట్ లాగ్రాంజ్ పాయింట్ లేదా L1గా పేర్కొనే పాయింట్‌ చుట్టూ కక్ష్యలో ఉంటుంది.సూర్య- భూమి వ్యవస్థలోని ఈ పాయింట్ వద్ద గురుత్వాకర్షణ శక్తులు బ్యాలెన్స్‌గా ఉంటాయి. సూర్యుడి అబ్జర్వేషన్‌కి అనువుగా కూడా ఉంటుంది. ఈ వాన్టేజ్ పాయింట్ నుంచి.. ఆదిత్య-ఎల్‌1 రియల్‌ టైమ్‌ సౌర కార్యకలాపాలను, అంతరిక్ష వాతావరణంపై వాటి ప్రభావాన్ని గమనించి రికార్డ్ చేస్తుంది. ఆదిత్య ఎల్‌1ను తొలుత లో-ఎర్త్‌ ఆర్బిట్‌లో ప్రవేశపెడతారు. అనంతరం ఆర్బిట్‌ను దీర్ఘ వృత్తాకారంగా మారుస్తారు. క్రమంగా శాటిలైట్‌ భూగురుత్వాకర్షణ పరిధిని దాటిపోతుంది. అనంతరం క్రూయిజ్‌ ఫేజ్‌ మొదలవుతుంది. తర్వాత ఎల్‌-1 పాయింట్‌ వద్దనున్న భారీ కక్ష్యలో ప్రవేశపెడతారు. భూమి నుంచి ఎల్‌1 పాయింట్‌ చేరడానికి 4 నెలల సమయం పడుతుంది.




Tags:    

Similar News