గత కొన్ని రోజులుగా స్మార్ట్ ఫోన్లకు ఓ అలర్ట్ మెసేజ్ వచ్చి.. వైబ్రేట్ అవుతూ మోగుతుంది. దీంతో స్మార్ట్ ఫోన్ యూజర్లు బెంబేలెత్తిపోతున్నారు. ఫోన్ హ్యాక్ అయిందా..? ఈ మెసేజ్లు ఎందుకు వస్తున్నాయి..? మా పర్సనల్ డేటాకు ఏమైనా ప్రమాదమా..? అంటూ తెగ కంగారు పడిపోతున్నారు. ఎందుకంటే.. ఆ మేసేజ్ లు ఎమర్జెన్సీ అలర్ట్, ఫ్లాష్ మెసేజ్ రూపంలో వస్తున్నాయి. మెజేస్ రాగానే ఫోన్ వైబ్రేట్ అవుతూ.. రింగ్ వస్తుండటంతో కాస్త కంగారుపడుతున్నారు. అయితే దీనికి కంగారు పడాల్సిన అవసరం లేదుని కేంద్రం చెప్పుకొచ్చింది. ఎందుకంటే వీటిని పంపింది కేంద్ర ప్రభుత్వమేనట. మెసేజ్ తో భయపడాల్సిన పనేంలేదని కేంద్ర వర్గాలు చెప్తున్నాయి. అలర్ట్ మెసేజ్ టెస్టింగ్ లో భాగంగా ఈ మెసేజ్ వస్తుంన్నట్లు చెప్పారు. ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాల ప్రజలకు ఈ అలర్ట్ మెసేజ్ లు వచ్చాయి.
ఈ మెసేజ్ లు ఎందుకు పంపిస్తున్నారంటే.. భూకంపాలు, సునామీలు, ఆకస్మిక వరదల్లాంటి విపత్తుల టైంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీతో కలిసి ఈ ఎమర్జెన్సీ అలర్ట్ వ్యవస్థను తీసుకొస్తుంది కేంద్రం. దీన్ని పరీక్షించగా.. స్మార్ట్ ఫోన్లకు పెద్ద సౌండ్ తో ఈ అలర్ట్ మెసేజ్ లు వస్తున్నాయి. ప్రస్తుతం ‘Emergency alert: Severe’ పేరుతో టెలికమ్యూనికేషన్ విభాగానికి (Department of Telecommunication) చెందిన అలర్ట్ మెసేజ్ వస్తుంది. ఇది సెల్ బ్రాడ్ కాస్టింగ్ పంపిన నమూనా టెస్టింగ్ మాత్రమే. దీనికి భయపడాల్సిన పనిలేదు. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏజెన్సీ పాన్ ఇండియా లెవల్ లో దీన్ని పరీక్షిస్తుంది. విపత్కర పరిస్థితుల్లో ప్రజలను హెచ్చరించేందుకు ఈ అలర్ట్ మెసేజ్ సిస్టమ్ ఉపయోగపడుతుంది. ప్రజా భద్రతను మరింత మెరుగుపరుస్తుంది.
అయితే ఈ అలర్ట్ మెసేజ్ ఎంటో అర్థం కాక చాలామంది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ఈ మెసేజ్ లపై క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. భయపడాల్సిన పనిలేదని, అత్యవసర ప్రసార సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఈ టెస్ట్ లు చేస్తున్నట్లు టెలికమ్యూనికేషన్ శాఖ ప్రకటించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఈ అలర్ట్ మెసేజ్ లు వచ్చాయి. గతంలో జులై 20 తేదీ, ఆగస్టు 17వ తేదీన రాగా.. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో కొంతమందికి ఈ మెసేజ్ వచ్చింది.