ఇస్రో శాస్త్రవేత్తలకు జీతాలు చాలా తక్కువ.. మాజీ ఛైర్మన్

Update: 2023-08-25 02:06 GMT

చంద్రుడి దక్షిణ ధ్రువంపై ఇస్రో పంపించిన చంద్రయాన్‌-3 (Chandrayaan 3) ల్యాండర్‌, రోవర్‌లు అడుగుపెట్టడంతో యావత్‌ దేశం ఉప్పొంగిపోతోంది. ఒక బాలీవుడ్‌ సినిమా నిర్మాణానికి అయ్యే ఖర్చుతోనే ఇస్రో ఈ అద్భుతాన్ని సృష్టిస్తోంది. అమెరికా, చైనా, రష్యా వంటి ఇతర దేశాలతో పోలిస్తే 60 శాతం తక్కువ ఖర్చుతోనే అత్యున్నత శిఖరాలను అధిరోహించింది. ఈ నేపథ్యంలో చంద్రయాన్‌-1లో కీలక భూమిక పోషించిన ఇస్రో మాజీ ఛైర్మన్‌ మాధవన్‌ నాయర్‌ (Madhavan Nair) కూడా హర్షం వ్యక్తం చేశారు. తాజాగా ఇస్రో చేపట్టే ప్రయోగాలు, వాటికి అయ్యే ఖర్చులు, ప్రయోగాల వెనక సేవలు అందించే శాస్త్రవేత్తల జీతాల గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇస్రో శాస్త్రవేత్తలు డబ్బును పట్టించుకోరని.. వారి దృష్టి మొత్తం ఎప్పుడూ మిషన్‌ పైనే ఉంటుందని తెలిపారు. అభివృద్ధి చెందిన దేశాలకు చెందిన శాస్త్రవేత్తలతో పోలిస్తే భారతీయ శాస్త్రవేత్తల జీతాలు అందులో ఐదోభాగం మాగ్రమేనని అన్నారు.




 


తక్కువ వేతనాలు పొందుతున్నప్పటికీ ఇస్రో శాస్త్రవేత్తలు తమ పరిశోధనలలో ఏనాడూ రాజీపడలేదని ఆయన స్పష్టం చేశారు. భారతీయ శాస్త్రవేత్తలు అంతరిక్ష పరిశోధనలలో తక్కువ ఖర్చుతో పరిష్కారాలను కనుగొనడం వెనుక తక్కువ జీతాలు పొందడం కూడా ఒక కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇస్రో శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు, ఇతర సిబ్బందికి అభివృద్ధి చెందిన దేశాలలోని శాస్త్రవేత్తల కన్నా అతి తక్కువ జీతాలు రావడం కూడా ఒక ఉపయోగమేనని, ఈ కారణంగానే తక్కువ ఖర్చుతో అంతరిక్ష పరిశోధనలు భారత్‌లో సాగుతున్నాయని ఆయన అన్నారు.

ఇస్రో శాస్త్రవేత్తలలో కోటీశ్వరులు ఎవరూ లేరని, వారు చాలా సామాన్యమైన, నిరాడంబర జీవితాన్ని గడుపుతారని మాధవన్ నాయర్ అన్నారు. వారు డబ్బు గురించి పట్టించుకోరని, తమ లక్ష్య సాధనకే అంకితమవుతారని ఆయన తెలిపారు. ఈ కారణంగానే ఇస్రో శాస్త్రవేత్తలు అత్యున్నత శిఖరాలను అధిరోహించగలుగుతున్నారని ఆయన అన్నారు. సరైన ప్రణాళిక, దీర్ఘకాల విజన్‌తోనే ఇస్రోకు గొప్ప విజయాలు సాధ్యం అవుతున్నాయని వివరించారు. అంతరిక్ష పరిశోధనలకు స్వదేశీ పరిజ్ఞానం ఉపయోగించడం వల్ల తక్కువ ఖర్చుతోనే ఇస్రో అంతరిక్ష పరిశోధనల్లో అద్భుత విజయాలు సాధించినట్లు తెలిపారు. ఒక్కో మెట్టును ఎక్కుతూ శిఖరానికి చేరుకోవడమే ఇస్రో లక్షమని, గతంలో నేర్చుకున్న జ్ఞానాన్ని తదుపరి మిషన్‌కు శాస్త్రవేత్తలు ఉపయోగించుకుంటారని ఆయన చెప్పారు.




Tags:    

Similar News