chandrayaan 3 : లూనార్ సౌత్ పోల్ ఫొటోలు పంపిన విక్రమ్

Update: 2023-08-21 06:31 GMT

చంద్రుడిపై కాలు మోపే అద్భుత ఘట్టం దిశగా చంద్రయాన్ - 3 శరవేగంగా అడుగులు వేస్తోంది. చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండింగ్ కోసం అనువైన ప్రదేశం కోసం ల్యాండర్ విక్రమ్ అన్వేషిస్తోంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఎవరూ చూడని జాబిల్లికి అటువైపు దృశ్యాలను విక్రమ్ కెమెరాలో బంధించింది. చందమామ దక్షిణ ధ్రువం వైపు ఉండే ప్రాంతానికి సంబంధించిన ఫోటోలను పంపింది.

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్.. ఇస్రో తాజాగా విక్రమ్ పంపిన ఫొటోలను ట్విట్టర్ లో షేర్ చేసింది. విక్రమ్‌ ల్యాండర్‌కు అమర్చిన ల్యాండర్‌ హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ అవైడెన్స్‌ కెమెరా భూమికి కన్పించని జాబిల్లి అవతలి వైపు ఫొటోలను తీసింది. విక్రమ్‌ చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండయ్యే ప్రాంతాన్ని గుర్తించేందుకు ఇది సాయపడుతుంది. బండరాళ్లు, లోతైన గుంటలు లేని ప్రదేశం కోసం ల్యాండర్‌ అన్వేషిస్తోందంటూ ఇస్రో ట్వీట్ చేసింది.

ఇస్రో ట్విట్టర్ లో షేర్ చేసిన ఫొటోలను విక్రమ్ ఆగస్టు 19న తీసనట్లు ఇస్రో ప్రకటించింది. ఈ ఫొటోల్లో ఉన్న బిలాల పేర్లను సైతం ఇస్రో ప్రకటించింది. ప్రస్తుతం విక్రమ్ ల్యాండర్‌ చంద్రుడి చుట్టూ 25×134 కి.మీల కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఈ ప్రయోగం సక్సెస్ అయితే జాబిల్లిపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేసిన సోవియట్‌ యూనియన్‌, అమెరికా, చైనా సరసన భారత్‌ చేరనుంది.

Tags:    

Similar News