మరికొద్ది గంటల్లో జాబిల్లిపై అడుగుపెట్టనున్న చంద్రయాన్ 3
జాబిల్లిపై మన వ్యోమనౌక అడుగుపెట్టే ఆ చారిత్రక క్షణాల కోసం యావత్ భారతదేశంతో పాటు ప్రపంచమంతా వేయికళ్లతో ఎదురుచూస్తుంది. మరి కొన్ని గంటల్లో చంద్రుడిపై చంద్రయాన్-3 కాలు మోపనుంది. లక్ష్యం దిశగా పైయనించిన చంద్రయాన్-3.. బుధవారం సాయంత్రం 6:04 గంటలకు చంద్రుడిపై దిగనుంది. విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన ల్యాండింగ్ మాడ్యూల్ చంద్రుడికి మరింత దగ్గరైంది. ఆ అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించేందుకు ఇస్రో అన్ని ఏర్పాట్లు చేసింది.
అయితే దక్షిణ ధ్రువంపై ల్యాండింగ్ ప్రక్రియ అత్యంత సంక్లిష్టంగా ఉంటుంది. ఈ నలభై రోజుల ప్రయాణమంతా ఒక ఎత్తయితే.. చివరి 17 నిమిషాల ప్రక్రియ మరో ఎత్తు. వాటినే శాస్త్రవేత్తలు 17 మినిట్స్ ఆఫ్ టెర్రర్ అని పిలుస్తారు. ఈ 17 నిమిషాల్లోనే ఎనిమిది దశల్లో ల్యాండర్‌ను జాబిల్లిపైకి దిగేలా ప్రణాళిక రూపొందించారంటే.. అది ఎంత క్లిష్టంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇస్రో శాస్త్రవేత్తలు నియంత్రణ లేని పరిస్థితుల్లో విక్రమ్ ల్యాండర్.. వేగాన్ని తనంతట తాను తగ్గించుకుంటూ జాబిల్లిపై దిగాల్సి ఉంటుంది. ల్యాండింగ్ ప్రక్రియ పూర్తిగా స్వతంత్రమైంది. ల్యాండర్ దాని పని అదే చేసుకోవాలి. సరైన ఎత్తులో, సరైన టైంలో, సరిపడా ఇంధనాన్ని ఉపయోగించుకుని ల్యాండర్ తన ఇంజిన్లను మండించుకోవాలి. దాని తర్వాత సురక్షిత ల్యాండింగ్ కోసం సేఫ్ ప్లేస్ ను స్కాన్ చేసి కిందకు ల్యాండ్ కావాల్సి ఉంటుంది. వేగాన్ని నియంత్రించేందుకు విక్రమ్ ల్యాండర్.. తన నాలుగు థ్రస్టర్ ఇంజిన్‌లను మండిస్తుంది. దీనిని పవర్డ్ బ్రేకింగ్ దశ అంటారు. ఇది దాదాపు 11 నిమిషాల పాటు కొనసాగుతుంది. అనంతరం ఫైన్ బ్రేకింగ్ దశ ఆరంభం అవుతుంది. ఈ దశలోనే చంద్రయాన్-2 ల్యాండర్ అదుపు తప్పి కూలిపోయింది. . ఈ సారి అవాంతరాలు ఎదురైనా వాటిని సమర్థంగా ఎదుర్కొనేలా విక్రమ్ ల్యాండర్‌ను తయారు చేశారు.
జాబిల్లి ఉపరితలానికి 100 నుంచి 150 మీటర్ల ఎత్తుకు చేరుకున్నప్పుడు తనలోని సెన్సార్లు, కెమెరాలు వినియోగించుకుని జాబిల్లి ఉపరితలంపై ఏమైనా అడ్డంకులు ఉన్నాయో లేదో స్కాన్ చేసి ల్యాండింగ్ చూసుకుంటుంది. ఆపై సాఫ్ట్-ల్యాండింగ్ చేసే ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఏ సమయంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా.. సాంకేతికంగా సమస్యలు ఉత్పన్నమైనా ల్యాండర్ చంద్రుడిపై దిగేలా అన్ని ఏర్పాట్లు చేశారు ఇస్రో సైంటిస్టులు. ల్యాండర్ జాబిల్లిపై సురక్షితంగా దిగిన తర్వాత ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ బయటకువ వచ్చి ఫోటోలు తీసి భూమ్మీదకు పంపిస్తుంది. 14 రోజుల పాటు రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై పరిశోధనలు చేస్తుంది.