ఉద్యోగులు బాగా పనిచేస్తే ఏ కంపెనీ అయినా ఏం చేస్తుంది. ఆ టాప్ పర్ఫార్మర్ ను ప్రశంసలతో ముంచెత్తుతుంది. శాలరీ హైక్ ఇస్తుంది. ఇంకొన్ని కంపెనీలు ప్రమోషన్ కూడా ఇస్తాయి. కానీ ఓ కంపెనీ మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరించింది. కంపెనీ మేనేజ్మెంట్కు ఉన్న పవర్ ఏంటో చూపించేందుకు టాప్ పర్ఫార్మర్ అయిన ఎంప్లాయిని ఉద్యోగం నుంచి పీకేసింది. రెడిట్ యూజర్ చేసిన పోస్ట్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
బాత్రూంకు వెళ్లినా తప్పే..
రెడిట్ యూజర్ తాను పనిచేసే కంపెనీలో దారుణ పరిస్థితులను తన పోస్టులో కళ్లకు కట్టాడు. కంపెనీలో పైస్థాయి ఉద్యోగులు.. కింది స్థాయి ఉద్యోగుల నుంచి కమీషన్ తీసుకుంటారని అందులో చెప్పాడు. కాంట్రాక్ట్ నిబంధనలను ఏమాత్రం పట్టించుకోరని, ఒకవేళ 5 నిమిషాల కన్నా ఎక్కువ సమయం బాత్‌రూమ్‌లో గడిపితే ప్రశ్నిస్తారని, ‘నచ్చకపోతే వెళ్లిపోండి’ అని హెచ్చరిస్తుంటారని అన్నారు. ఇటీవలే తన తోటి ఉద్యోగిని అన్యాయంగా పంపించారని ఆవేదన వ్యక్తం చేశారు.
బెదిరించేందుకే
ఓ రోజు తనను పిలిచి టార్గెట్ రీచ్ కానందున ఉద్యోగం నుంచి తొలగిస్తామని బెదిరించారని సదరు ఉద్యోగి వాపోయారు. తాను కమిషన్ ఇవ్వనందుకే తన పై స్థాయి అధికారి అలా బెదిరించారని చెప్పారు. తాజాగా తనతో పాటు పనిచేసే ఓ ఉద్యోగిని ఉన్నపళంగా తొలగించారని, వాస్తవానికి ఆయన కంపెనీలో టాప్ పర్ఫార్మర్ అని కానీ ఆయన సేల్స్ ఫిగర్స్ కాస్త తక్కువగా ఉండటంతో ఇంటికి సాగనంపారని అన్నారు. నిజానికి అసలు కారణం వారు చెప్పినది కాదని కమిషన్ తీసుకున్నారని, కాంట్రాక్ట్ నిబంధనలు ఉల్లంఘించినందుకే ఉద్యోగం నుంచి తొలగించారని స్పష్టం చేశారు. ఇకపై ఎవరైనా తమను ప్రశ్నిస్తే వారికి కూడా ఇదే గతి పడుతుందని మేనేజర్ తనతో చెప్పిన విషయాన్ని ఆయన రెడిట్ లో నెటిజన్లతో పంచుకున్నారు.
నెటిజన్ల ఆగ్రహం
ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందన్న విషయం తెలియకపోయినా 3 రోజుల క్రితం రాసిన ఈ పోస్టుపై పలువురు యూజర్లు స్పందిస్తున్నారు. కంపెనీ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఉద్యోగుల పట్ల ఇలా వ్యవహరించడం అన్యాయమని అన్నారు. ‘ఒకర్ని తొలగించడం ద్వారా మరింత మంది నోరు నొక్కడమే కాకుండా.. వారి నుంచి మరింత కమీషన్ దోచుకునే ఎత్తుగడ’ ఇది అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు.