మెసేజింగ్ యాప్ గా లాంచ్ అయిన టెలిగ్రామ్.. పైరసీ సినిమాలకు కేరాఫ్ గా మారిపోయింది. కొత్తగా రిలీజ్ అయిన సినిమా, వెబ్ సిరీస్ లు ఏవైనా పైరసీలో చూడ్డానికి చాలామంది టెలిగ్రామ్ వెంటే చూస్తారు. ఆ సినిమాలను ప్రొవైడ్ చేసే టెలిగ్రామ్ చానల్స్ లో ముందూ వెనకా చూడకుండా జాయిన్ అవుతుంటారు. వీరి ఆసక్తిని ఆసరాగా తీసుకున్న సైబర్ నేరగాళ్లు.. కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. టెలిగ్రామ్ లో సినిమా పేరు సెర్చ్ చేయగానే.. ఫ్రీ డౌన్ లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అలా కనిపించగానే చాలామంది ఆ లింక్స్ ను క్లిక్ చేస్తారు.
ఫ్రీగా సినిమాలు చూడాలంటే ఫలానా యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని కొన్ని గ్రూప్స్ సూచిస్తుంటాయి. దాంతో వేరే ఆలోచించకుండా.. ఏమౌంతుందిలే అని ఆ యాప్స్ ను డౌన్ లోడ్ చేస్తుంటారు. అలా చేశారో ఇక అంతే సంగతి. మీ వ్యక్తిగత డేటా మొత్తం ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అలా సినిమా పేరుతో లింక్స్ క్రియేట్ చేసి.. యూజర్ల బ్యాంక్ అకౌంట్లు ఖాళీ చేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ తరహా టెలిగ్రామ్ యాప్ లో కొత్తగా వెలుగులోకి వచ్చాయని పోలీస్ అధికారులు తెలిపారు. ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇలా టెలిగ్రామ్ లింక్స్ ద్వారా యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవద్దని హెచ్చరించారు.