జీమెయిల్‌ సర్వీసులు బంద్‌.. గూగుల్‌ క్లారిటీ

Byline :  Shabarish
Update: 2024-02-24 14:10 GMT

జీమెయిల్ అనేది ఇప్పుడు స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా మారిపోయింది. ఫోన్లో అయినా, యాప్ అయినా, ఆన్‌లైన్‌లో ఏ సేవలు వినియోగించుకోవాలనుకున్నా జీమెయిల్ అకౌంట్ కచ్చితంగా ఉండాల్సిందే. నిత్య జీవితంలో భాగమైపోయిన జీమెయిల్‌ను ఆగస్టు నెల నుంచి మూసివేస్తున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. గూగుల్ ఈజ్ సన్ సెట్టింగ్ జీమెయిల్ అంటూ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. దీనిపై గూగుల్ కంపెనీ స్పందిస్తూ ఓ క్లారిటీ ఇచ్చింది.

జీమెయిల్ సర్వీసులను మూసివేస్తున్నట్లుగా కొంతకాలంగా వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఆ వార్తలన్నీ పుకార్లేనని గూగుల్ కంపెనీ క్లారిటీ ఇచ్చింది. జీమెయిల్ సేవలను నిలిపివేసే ప్రసక్తే లేదని తెలిపింది. జీమెయిల్ బేసిక్ వెర్షన్ అయిన హెచ్‌టీఎంఎల్ సేవలను మాత్రమే నిలిపివేస్తున్నట్లు గూగుల్ వెల్లడించింది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా, నెట్ స్లోగా ఉన్నా ఈమెయిల్ పంపేందుకు, పొందేందుకు వీలుగా హెచ్‌టీఎంఎల్ వెర్షన్ అందుబాటులో ఉండేది. అయితే ఇకపై ఆ సేవలను గూగుల్ నిలిపివేస్తున్నట్లుగా తెలిపింది.

గూగుల్ ఇలా చేయడం వల్ల ఇకపై నెట్ వర్క్ సరిగ్గా లేని సమయంలో మెయిల్స్ పొందడం అనేది కుదరకపోవచ్చు. మరోవైపు జీమెయిల్ సేవలను గూగుల్ షట్‌డౌన్ చేస్తుందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ తరుణంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా కీలక ప్రకటన చేశాడు. జీమెయిల్‌కు పోటీగా త్వరలోనే ఎక్స్ మెయిల్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించారు.


Tags:    

Similar News