వాట్సాప్ వాడనివారంటూ ఈ రోజుల్లో ఎవ్వరూ లేరు. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ వాట్సాప్ వాడందే నిద్రపట్టదు. అటువంటి వాట్సాప్ యాప్ తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు ప్రత్యేక ఫీచర్లను తీసుకొస్తూ ఉంటుంది. తమ యూజర్ల కోసం కొత్త వాటిని పరిచయం చేస్తుంటుంది. గత ఏడాది హెచ్‌డీ క్వాలిటీతో ఫోటోలు, వీడియోలను ఇతరులకు పంపించేందుకు వీలుగా 2జీబీ ఫైల్ షేరింగ్ ఫీచర్‌ను తెచ్చింది.
తాజాగా మరో కొత్త ఫీచర్‌ను వాట్సాప్ తమ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ ఓఎస్ 'నియర్‌బై షేర్' ఐఓఎస్ 'ఎయిర్ డ్రాప్' తరహాలోనే పనిచేసేలా 'నియర్‌బై షేర్' ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా ఇకపై పక్కనే ఉన్నవారికి ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఫైల్స్ పంపొచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ 'వాబీటా ఇన్ఫో' వెల్లడించింది. గతంలో అయితే ఏదైనా ఫైల్స్, ఫోటోలు, ఆడియో, వీడియోలను షేరింగ్ చేయడానికి 'షేర్ ఇట్' యాప్‌ను ఎక్కువ మంది వినియోగించేవారు. ఆ యాప్‌ను కేంద్రం నిషేధించింది.
ఆ తర్వాత నియర్‌బై షేర్ ఫీచర్ ఆండ్రాయిడ్ ఓఎస్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పుడు అదే ఫీచర్‌ను వాట్సాప్ కూడా అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఎలాంటి కేబుల్స్, నెట్‌వర్క్ అవసరం లేకుండానే డివైజ్ టు డివైజ్ కనెక్టివిటీతో ఫైల్స్ షేర్ చేయొచ్చు. 'పీపుల్ నియర్‌బై' పేరుతో ఈ ఫీచర్‌ను వాట్సాప్ తమ యూజర్లకు పరిచయం చేయనుంది. ఫోన్‌లో వాట్సాప్ యాప్ ఓపెన్ చేసి డివైజ్‌ను కలిపితే షేర్ రిక్వెస్ట్ వెళ్తుంది. దానిని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఫైల్స్ షేరింగ్ మొదలవుతుంది. వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది.