Massive Crater On Moon : చంద్రుడిపై భారీ గొయ్యి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
చంద్రుడిపై అడుగు పెట్టిన మన చంద్రయాన్-3 ప్రజ్ఞాన్ రోవర్ తన పనిలో నిమగ్నమయింది. ఇప్పటికే కొన్ని పరిశోధనలు జరిపి ఇస్రోకు పంపించింది. అంతా మంచే జరుగుతుంది అనుకున్న క్రమంలో ఇస్రో పిడుగు లాంటి వార్తను ట్వీట్ చేసింది. ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణించే మార్గంలో లోతైన గొయ్యి కనిపించిందని ఇస్రో ప్రకటించింది. ప్రమాదాన్ని ముందే గుర్తించిన ఇస్రో.. రోవర్ దారి మళ్లించింది. ‘ఆదివారం (ఆగస్ట్ 27) రోవర్ తిరుగుతున్న ప్రాంతంలో నాలుగు మీటర్ల వెడల్పున్న గొయ్యిని గుర్తించాం. ఇది రోవర్ కు మూడు మీటర్ల దూరంలో కనిపించింది. దీంతో వెంటనే అప్రమత్తమై.. వెనక్కి వచ్చి తన మార్గాన్ని మార్చుకోవాలని రోవర్ కు కమాండ్ ఇచ్చాం. ఆ ఆదేశాలు పాటించి దాని మార్గాన్ని మళ్లించింది. ప్రస్తుతం రోవర్ సురక్షితమైన మార్గంలో వెళ్తుంద’ని ఇస్రో చెప్పుకొచ్చింది.