థ్రెడ్స్ సంచలనం... 4.5 రోజుల్లోనే 10 కోట్ల మంది యూజర్లు
సోషల్ మీడియాను మరింత ప్రజాస్వామీకరించేందుకు, ట్విటర్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా తీసుకొచ్చిన థ్రెడ్స్ యాప్ రికార్డులను తిరగరాస్తోంది. ప్రారంభమైన నాలుగున్నర రోజులకే ఏకంగా 10 కోట్ల మంది యూజర్లకు చేరువైంది. వందకుపైగా దేశాల్లో థ్రెడ్స్ యాప్‌ను 10 కోట్ల మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లు థ్రెడ్స్ తెలిపింది. ఈ యాప్‌ను ఈ నెల 6వ తేదీన లాంచ్ చేయగా సోమవారం మధ్యాహ్నానికి 100 మిలియన్ యూజర్లు తోడయ్యారు. మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్.. ఇన్‌స్టాగ్రామ్ యాప్‌కు లింక్ చేస్తూ థ్రెడ్స్ యాప్‌ను పట్టుకొచ్చాడు. అయితే ఇది అచ్చం ట్విటర్ లాగే ఉందనే విమర్శలు వస్తున్నాయి. ట్విటర్లో చూసే పోస్టులకు పరిమితి విధించడం, పైసా వసూలు ప్రారంభించడంతో చాలామంది బ్లూ స్కైతోపాట థ్రెడ్స్ వంటి ప్రత్యామ్నాయాలపై వెళ్తున్నారు. థ్రెడ్స్ మిగతా యాప్స్ కంటే శరవేగంగా 10 కోట్ల మార్కును దాటింది. చాట్ జీపీటీ 10 కోట్ల యూజర్లను చేరుకోవడానికి 2 నెలలు పట్టింది. వాట్సాప్‌కు మూడేళ్ల నాలుగు నెలలు, యూట్యూబ్‌కు నాలుగేళ్లు, ఫేస్‌బుక్‌కు నాలుగేళ్ల ఏడు నెలలలు జీమెయిల్‌కు ఏడేళ్లు, ట్విటర్‌కు ఐదేళ్లు పట్టింది.
థ్రెడ్స్ మొదలైన తొలి నాలుగు గంటల్లోనే అరకోటి మంది ఖాతాలు తెరిచారు. దీనికి ఇన్‌స్టాగ్రామ్‌తో లింక్ ఉండంతో డౌన్స్ డోన్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇన్‌స్టాలో నెలకు 230 కోట్ల మందికిపైగా క్రియాశీలంగా ఉంటారు. అయితే రెండింటికీ లింక్ ఉండడం వల్ల కొన్ని సమస్యలు తలెత్తతున్నాయి. థ్రెడ్స్‌లో లాగిన్ కావడానికి ఇన్‌స్టా అకౌంట్‌ను డీయాక్టివేట్ చేయాల్సి వస్తోంది. రెండూ దేనికది విడివిడిగా ఉంటే బావుంటుందని యూజర్లు కోరుతున్నయి. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని మెటా తెలిపింది.
కేసు పెడతా.. మస్క్
థ్రెడ్స్ తమ ట్విటర్‌లాగే ఉందంటూ ఎద్దేవా చేస్తున్న ట్విటర్ అధినేత ఎలన్ మస్క్.. జుకర్‌బర్గ్‌కు వార్నింగ్ ఇచ్చారు. మెటా కాపీరైట్‌ను ఉల్లంఘించి, రహస్యాలు దొంగిలిస్తోందని, దీనిపై కోర్టులో కేసు వేస్తానని హెచ్చరించారు.