Chandrayaan 3 : ఇప్పటికే అలా జరగాల్సింది.. ఇస్రో మాజీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
ఇస్రో చేపట్టిన చంద్రయాన్ 3 ప్రస్థానం ముగిసినట్లేనా..? జాబిల్లిపై విక్రమ్ ల్యాండర్, రోవర్ల కదలికలు ఇక లేనట్లేనా? అంటే అవుననే అనిపిస్తుంది. ప్రస్తుతం చంద్రుడిపై చీకటి అలుముకుంది. మరో 10 రోజల దాకా వెలుగు రాదు. అంతకుముందు ఇస్రో శాస్త్రవేత్తలు ల్యాండర్, రోవర్లతో కనెక్ట్ అయ్యేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. ఎంత ట్రై చేసినా వాటి నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. దీంతో చందమామపై వాటి ప్రస్థానం ముగిసినట్లేనన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మళ్లీ సూర్యోదయం తర్వాత ఇస్రో తన ప్రయత్నాలను కొనసాగించే అవకాశం ఉంది.
ఈ క్రమంలో ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ ఈ అంశంపై స్పందించారు. ల్యాండర్, రోవర్‌లు మేల్కొంటాయన్న నమ్మకం లేదని చెప్పారు. ఒక వేళ అవి మేల్కోవాల్సి ఉంటే ఇప్పటికే అది జరిగి ఉండేదని.. ఇక అవి స్లీప్ మోడ్ నుంచి బయటకు వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికే అవి తమ పనిని పూర్తి చేశాయన్నారు. చంద్రయాన్ 3 అందించిన సమాచారం భవిష్యత్ లో ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అదేవిధంగా చంద్రుడిపై నుంచి నమూనాలు తీసుకొచ్చే ప్రాజెక్టులు సైతం భవిష్యత్లో చేపట్టే అవకాశాలున్నాయని చెప్పారు.
చంద్రుడి దక్షిణ ధ్రువంపైన చంద్రయాన్ -3 ప్రయోగాన్ని చేపట్టి ఇస్రో చరిత్ర సృష్టించింది. జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా రికార్డు సాధించి భారత దేశ కీర్తిని ప్రపంచదేశాల్లో చాటి చెప్పింది. ఈ మిషన్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న జాబిల్లిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ల్యాండర్‌లోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి చేరుకుని పరిశోధనలు జరిపి విలువైన సమాచారాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు అందించింది. నిర్విరామంగా దాదాపు 14 రోజుల పాటు ఇవి రెండు చంద్రుడిపై పని చేశాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 3న సూర్యాస్తమయం కావడంతో ఇవి రెండో స్లీప్ మోడ్‌లోకి వెళ్లిపోయాయి.