Chandrayaan 3 : ల్యాండర్, రోవర్ నుంచి ఇంకా అందని సంకేతాలు
ప్రస్తుతం జాబిల్లిపై చంద్రయాన్ 3 ల్యాండర్, రోవర్ స్లీప్ మోడ్లో ఉన్నాయి. చంద్రుడిపై సూర్యకాంతి రావడంతో విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ను తిరిగి యాక్టివేట్ చేసేందుకు ఇస్రో అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికీ రెండు రోజులు గడుస్తున్నా వాటి నుంచి ఎలాంటి సిగ్నళ్లు రాలేదు. అయితే విక్రమ్, ప్రజ్ఞాన్తో తిరిగి సంబంధాలు పునరుద్దరించే ప్రక్రియ కొనసాగుతుందని ఇస్రో స్పష్టం చేసింది.
2019లో చైనాకు చెందిన ల్యాండర్ చాంగ్ - 4, రోవర్ యుటు - 2లను సూర్యకాంతి వచ్చిన తర్వాత తిరిగి యాక్టివేట్ చేసినట్లు నిపుణులు చెబుతున్నారు. అయితే దక్షిణ ధ్రువం వద్ద పరిస్థితులు వేరని, రాత్రి సమయంలో అక్కడి ఉష్ణోగ్రత -250 డిగ్రీల సెల్సియస్‌కు వరకు పడిపోయింనందున ల్యాండర్, రోవర్ తిరిగి పనిచేయడం కష్టమని పలువురు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చంద్రుడిపై రాత్రి కావడంతో ఈ నెల 3న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లను ఇస్రో స్లీప్ మోడ్ లోకి పంపించింది. అప్పటికే ల్యాండర్, రోవర్ తమ పనులను కంప్లీట్ చేశాయి. ఒకవేళ ల్యాండర్, రోవర్ తిరిగి పనిచేస్తే జాబిల్లిపై చంద్రయాన్-3 ప్రయోగాలకు బోనస్ లభించినట్లు అవుతుంది. కాగా జులై 14న ఇస్రో చంద్రయాన్ 3 ప్రయోగం చేపట్టగా.. అగస్ట్ 23న చంద్రడిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయ్యింది. ఆ తర్వాత దానిలోని రోవర్ బయటకు వచ్చి తమ పనిని పూర్తిచేశాయి.