చంద్రుడికి అడుగు దూరంలో చంద్రయాన్ 3.. లూనా-25లో సాంకేతిక లోపం..

Update: 2023-08-20 07:37 GMT

చంద్రయాన్ - 3 జాబిల్లిపై దిగడానికి మరో అడుగు దూరం మాత్రమే ఉంది. అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసిన చంద్రయాన్ - 3.. జాబిల్లిపై దిగడానికి సిద్ధమైంది. ప్రస్తుతం చంద్రుడికి 25కిలోమీటర్ల దూరంలో విక్రమ్ ల్యాండర్ తిరుగుతోంది. ఈ నెల 23న సాయంత్రం 5.45 గంటలకు సాఫ్ట్ ల్యాండింగ్ జరిగే అవకాశం ఉంది. అయితే గత 24గంటల్లో చంద్రుడిపై పరిస్థితులు మారిపోయాయి. రష్యా పంపిన లూనా - 25 లో సాంకేతిక లోపం వచ్చింది. దీంతో లూనా సాప్ట్ ల్యాండింగ్ ఎప్పుడనేది స్పష్టత లేదు.

ఎవరిది ముందు..?

చంద్రుడి దక్షిణ ధృవంపై ఇండియా, రష్యా ప్రయోగాలు చేపట్టాయి. జులై 14న ఇస్రో చంద్రయాన్ -3 ప్రయోగం చేపట్టింది. రష్యా దాదాపు 50 ఏండ్ల తర్వాత అగస్ట్ 10 లూనా- 25 రాకెట్ను జాబిల్లిపైకి పంపింది. అప్పటినుంచి ఎవరిది ముందు సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుందనేది చర్చనీయాంశంగా మారింది. అయితే రష్యా లూనా రాకెట్లో సాంకేతిక లోపం వచ్చింది. దీంతో దాన్ని సాఫ్ట్ ల్యాండింగ్ ఎప్పడనేదానిపై రోస్కాస్మోస్ ఎటువంటి ప్రకటన చేయలేదు.

అగస్ట్ 23పైనే..

ఇక చంద్రయాన్-3లో అన్ని ప్రక్రియలు పూర్తికాగా.. కేవలం ల్యాండర్ చంద్రుడిపై దిగడమే మిగిలి ఉంది. చంద్రయాన్ 3లో అర్ధరాత్రి కీలక ఘట్టం పూర్తి అయ్యింది. చివరి డీ-బూస్టింగ్‌ ప్రక్రియ విజయవంతంగా పూర్తైనట్లు ఇస్రో తెలిపింది. ప్రస్తుతం విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడికి అత్యల్పంగా 25 కి.మీ, అత్యధికంగా 134 కి.మీలో దూరంలో తిరుగుతోంది. విక్రమ్.. ఆటోమేటిక్‌గా ల్యాండింగ్‌ సైట్ ఎంచుకోనుంది. దీంతో అందరి దృష్టి ఆగస్టు 23పైనే ఉంది. ఆగస్ట్‌ 23న సా.5.45గం.లకు ల్యాండింగ్‌ ప్రక్రియ జరగనుంది. సూర్యోదయం కోసం ఎదురుచూస్తున్నాం అంటూ ఇస్రో ట్వీట్‌ చేసింది.

Tags:    

Similar News