BRS manifesto: బీఆర్ఎస్ చెప్పింది 10శాతం.. చేసింది 90శాతం: కేసీఆర్
సీఎం కేసీఆర్ మేనిఫెస్టో విడుదల చేశారు. ఇవాళ తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో మేనిఫెస్టోను ప్రకటించారు. ఓటర్లను ఆకర్షించేందుకు.. కేసీఆర్ మేనిఫెస్టో ద్వారా వరాల జల్లు కురిపించారు. గతలో జరిగిన 2 ఎలక్షన్స్ లో తాము 10 శాతం పథకాలు మాత్రమే మేనిఫెస్టోలో ప్రకటించామని, మిగతా 90శాతం ప్రకటించకుండానే అమలు చేశామని కేసీఆర్ తెలిపారు. ఎప్పుడూ రైతుబంధును మేనిఫెస్టోలో చేర్చలేదని, అయినా రైతుల సంక్షేమం కోసం ఆ పథకాన్ని అమలు చేశామని చెప్పుకొచ్చారు. తెలంగాణ.. రాష్ట్రంగా ఏర్పడినప్పుడు పరిస్థితులన్నీ అగమ్య గోచరంగా ఉండేవని, సాగు, తాగునీరు లేక కరవుతో అల్లాడుతూ ఉండేదని గుర్తుచేశారు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర రూపురేకలు మార్చిందని తెలిపారు. గతంలో బతుకుదెరువు కోసం తెలంగాణ బిడ్డలు వలస వెళ్లారు. ఇప్పుడు అద్భుతమైన ప్రగతిలో దూసుకెళ్తున్నామని అన్నారు.
మేనిఫెస్టో ముఖ్యాంశాలు:
▪️ ఇకపై కూడా దళితబంధు పథకాన్ని కొనసాగిస్తామని కేసీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా మైనార్టీ బడ్జెట్ పెంచుతామని, మైనార్టీ జూనియర్ కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. తండాలు, గోండు గూడేలను పంచాయతీలుగా చేస్తామని ప్రకటించారు.
▪️ తెల్ల రేషన్ కార్డు ఉన్న 93 లక్షల మందికి రూ.5 లక్షల కేసీఆర్ బీమా. దీనికోసం ఎల్ఐసీ ద్వారా ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది. ‘కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికీ ధీమా’గా ఈ పథకానికి పేరు పెట్టారు. ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లోనే పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ప్రకటించారు.
▪️ ఆసరా పెన్షన్లను రూ.5 వేలకు పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రూ.1,000 నుంచి మొదలుపెట్టి దశల వారీగా దీన్ని రూ.5వేలకు చేస్తామని హామీ ఇచ్చారు.
▪️ అర్హులైన పేద మహిళలకు ‘సౌభాగ్య లక్ష్మి పథకం’కింద నెలకు రూ.3వేల గౌరవ భృతి
▪️ అర్హులైన వారికి రూ.400లకే గ్యాస్ సిలిండర్, ఆధాయంతో పనిలేకుండా, ప్రజారంగంలో పనిచేస్తున్న జర్నలిస్టుల అందరికీ రూ.400లకే గ్యాస్ సిలిండర్.
▪️ వికలాంగుల పెన్షన్ రూ.6వేల పెంపు. దశల వారీగా పెన్షన్ అమలు చేస్తామని హామీ.
▪️ తెలంగాణ అన్నపూర్ణ పేరుతో ఇంటింటికీ సన్న బియ్యం.
▪️ రైతు బంధు పెంపు. దశలవారీగా రైతుబంధు రూ.16 వేలు అమలు.
▪️ గతంలో రూ.10 లక్షలకు ఉన్న ఆరోగ్య శ్రీని రూ. 15 లక్షలకు పెంపు. అంతేకాకుండా జర్నలిస్ట్ లకు రూ.15 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు. దీనికి కేసీఆర్ ఆరోగ్య రక్షగా పేరు.
▪️ హైదరాబాద్ లో మరో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం. ఇండ్లు ఉన్నవాళ్లకు గృహలక్ష్మి కొనసాగిస్తూనే.. ఇండ్ల స్థలాలు లేనివారికి స్థలాలు కూడా ప్రభుత్వమే సమకూర్చుతుంది.
▪️ అగ్రవర్ణ పేదలకు 119 గురుకులాల నిర్మాణం.
▪️ 46 లక్షల మంది స్వశక్తి మహిళా గ్రూపులో సభ్యులుగా ఉన్నారు. స్వశక్తి మహిళా గ్రూపులకు దశలవారీగా పక్కా భవనాలు నిర్మాణం.
▪️ అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేత. మామూలు పట్టాదారులకు హక్కులు కల్పించే ప్రయత్నం.
▪️ ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్‌పై భరోసా.