తెలంగాణలో మూడు రోజులు వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్..
ఎండ, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఆదివారం నుంచి మంగళవారం వరకు ఉత్తర, దక్షిణ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ క్రమంలో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని.. దీని ప్రభావంతో వర్షాలు పడతాయని చెప్పింది.
ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, కామారెడ్డి,ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అగస్ట్ నుంచి వానలు ముఖం చాటేయడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ ప్రకటన వారికి కొంత ఊరటనిచ్చింది. జులైలో వానలు దంచికొట్టాయి. భారీ వర్షాలకు వాగులు,వంకలు పొంగిపొర్లాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ గ్రామమే నీట మునిగింది. అటు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. అయితే ఆ తర్వాత నుంచి వానలు ముఖం చాటేశాయి. అగస్ట్లో అతితక్కువ వర్షపాతం నమోదైంది.