ఇవాళ హైదరాబాద్లో రెండు మెట్రో స్టేషన్లను అధికారులు మూసివేయనున్నారు. సాయంత్రం 4:30 నుంచి 6:30 గంటల మధ్య చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ప్రధాని మోదీ రోడ్ షో సందర్భంగా భద్రతాపరమైన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ప్రయాణికులు దీనికి అనుగుణంగా వ్యవహరించాలని అధికారులు కోరారు. కాగా సాయంత్రం 4 గంటలకు ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో మోదీ రోడ్ షో నిర్వహిస్తారు. ఈ రోడ్ షో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి మొదలై నారాయణగూడ, వైఎంసీఏ మీదుగా కాచిగూడ క్రాస్‌రోడ్స్ వరకు జరగనుంది.
కాగా ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారిని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. నిన్న తిరుమల వెళ్లిన మోదీ.. ఇవాళ ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. సుమారు 50 నిమిషాల పాటు ఆయన ఆలయంలో ఉన్నారు. ప్రధాని హోదాలో మోదీ తిరుమలకు వెళ్లడం ఇది నాలుగోసారి. ఇంతకుముందు 2015, 2017, 2019లో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు.