నేటి నుంచే బీసీల్లోని వృత్తికులాలకు రూ.లక్ష ఆర్థికసాయం

మంచిర్యాల వేదికగా ప్రారంభించనున్న సీఎం

Update: 2023-06-09 01:49 GMT





ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు మరో వినూత్నమైన పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. వెనుకబడిన కులాలకు, చేతివృత్తిదారులకు(బీసీలకు) రూ.లక్ష ఆర్థికసాయం అందివ్వనున్నారు. అదేవిధంగా రెండో విడత గొర్రెల పంపిణీని కూడా లాంఛనంగా ప్రారంభించనున్నారు. మంచిర్యాల వేదికగా ఈ రెండు కార్యక్రమాలను సీఎం కేసీఆర్‌ నేడు (శుక్రవారం) ప్రారంభించనున్నారు. బీసీల్లోని కులవృత్తుల్లో ఉన్నవారికి, చేతివృత్తిదారులకు పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు బ్యాంకు లింకేజీ లేకుండా రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఇటీవలే(ఈ నెల 6 న) ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈనెల 20వ తేదీ వరకు కొనసాగనున్నది. ఇది నిరంతర ప్రక్రియ కాగా, అర్హులను ఎంపిక చేసి ప్రతి నెలా 15న లబ్ధిదారులకు చెక్కులను అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది.దరఖాస్తుల స్వీకరణ కోసం https://tsobmmsbc.cgg.gov.in వెబ్ సైట్ ను ప్రారంభించారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.

ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకునే వారికి మార్గదర్శకాలు:

• లబ్ధిదారులు బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారులై ఉండాలి.

• వయసు జూన్ 2 నాటికి 18 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

• వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ. 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 1.50 లక్షలకు మించి ఉండకూడదు.

• పనిముట్లు, ముడిసరుకు కొనుగోలుకు మాత్రమే నిధులు అందిస్తారు.

• కుటుంబంలో ఒక్కరికి మాత్రమే పథకం వర్తిస్తుంది.

• గత 5 ఏళ్లలో ఏ ప్రభుత్వ శాఖ ద్వారా ఆర్థిక సాయం పొంది ఉండకూడదు.

• 2017-18లో రూ. 50 వేల ఆర్థికసాయం పొందినవారు కూడా అనర్హులు.

• వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.

• ఆదాయ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ బుక్, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోను సమర్పించాలి.

• మండల స్థాయిలో ఎంపీడీఓలు, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో పర్యటించి దరఖాస్తుదారుల వివరాలను పరిశీలిస్తారు.

• ఎంపికైన లబ్ధిదారులను ఆన్ లైన్ లో ప్రకటిస్తారు.

• ఎంపికైన వారి బ్యాంకు ఖాతాకు నేరుగా ఆర్థికసాయాన్ని జమ చేస్తారు. ఆర్థికసాయం పొందిన నెలలోగా పనిముట్లు, ముడిసరుకు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Tags:    

Similar News