చెరువుల పండుగలో మంత్రి గంగులకు తప్పిన ప్రమాదం
చెరువుల పండుగలో మంత్రి గంగులకు తప్పిన ప్రమాదం;
తెలంగాణ దశాబ్ది వేడుకల్లో భాగంగా కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన చెరువుల పండుగలో అపశ్రుతి చోటు చేసుకుంది. కరీంనగర్ రూరల్ మండలం ఆసిఫ్‌నగర్ ఊర చెరువు వద్ద గురువారం నిర్వహించిన చెరువుల పండుగకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ హాజరయ్యారు. కార్యక్రమం నిర్వహిస్తుండగా చెరువులో ఉన్న నాటు పడవ ఎక్కాలని స్థానిక బీఆర్‌ఎస్ కార్యకర్తలు కోరారు. ఆయన పడవ ఎక్కుతుండగా ఒక వైపు ఒరిగింది. దీంతో బ్యాలెన్స్ కోల్పోయిన మంత్రి గంగుల కమలాకర్ నీటిలో పడిపోయారు. అక్కడే ఉన్న పోలీసులు, బాడీగార్డులు వెంటనే చెరువులోకి దిగి ఆయనను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. మంత్రికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అంతకుముందు చామన్ పల్లి గ్రామంలో ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంగుల కమలాకర్... గ్రామంలోని అప్పనపల్లి చెరువు వద్ద ఏర్పాటు చేసిన బతుకమ్మ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. గ్రామంలోని మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలతో మంత్రి గంగుల కు స్వాగతం పలుకగా మంత్రి స్వయంగా బతుకమ్మ ను ఎత్తుకొని చెరువు వద్దకు చేరుకున్నారు.
కాగా అంతకుముందు.. నిజామాబాద్ లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి కూడా పెను ప్రమాదం తప్పింది. చెరువుల పండుగ సందర్భంగా సొంత నియోజకవర్గం బాల్కొండలో మంత్రి పాల్గొన్న కార్యక్రమంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భీంగల్ మండలం పురానిపేట్ గ్రామ చెరువువద్ద ఏర్పాటుచేసిన కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు మంత్రి. అయితే మంత్రికి స్వాగతం పలికే సమయంలో బిఆర్ఎస్ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించారు. భారీగా బాణాసంచా పేల్చడంలో నిప్పురవ్వలు ఎగసిపడి కార్యక్రమం కోసం ఏర్పాటుచేసిన టెంట్ పై పడ్డాయి. దీంతోఒక్కసారిగా మంటలు చెలరేగి టెంట్ కాలిపోయింది. దీంతో వెంటనే భద్రతా సిబ్బంది, పోలీసులు మంటలను అదుపుచేయడంతో మంత్రితో పాటు ప్రజలకు ప్రమాదం తప్పింది