Former MP Harsha Kumar: ఏపీలో ఆ ముగ్గురే పెత్తందారులు.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Byline :  Veerendra Prasad
Update: 2024-02-05 11:25 GMT

వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మాజీ ఎంపీ హర్షకుమార్. ఇసుక , మద్యంలో జగన్ విపరీతంగా దోచుకున్నారని.. విశ్వవిద్యాలయాలను రాజకీయాలకు కేంద్రాలుగా మార్చేశారని మండిపడ్డారు. జగన్ అవినీతి పరిపాలన, పెత్తందారీ పాలన చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులకు సంబంధించిన 27 పథకాలు వైసీపీ ప్రభుత్వం తీసేసిందన్నారు. అమ్మఒడి పథకానికి జగన్ తూట్లు పొడిచారన్నారు. నవరత్నాలకు బడ్జెట్ నుంచి కేటాయించాలని... కానీ అమ్మఒడి లబ్ధిదారులకు జగన్ విచిత్రంగా దళితుల సబ్ ప్లాన్ నుంచి నిధులు కేటాయిస్తున్నారన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి విధానాల వలన దళిత విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని ఫైర్ అయ్యారు. జగన్ కు 100 శాతం ఓట్లు వేసినా దళితులను మోసం చేశారని, జగన్ పెద్ద చీటర్ అని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి రుణం ఇవ్వకుండా జగన్ మోసం చేశారని ధ్వజమెత్తారు. జగనన్న విదేశీ విద్యా పథకం ద్వారా ఒక్కరినైనా జగన్ విదేశాలకు పంపించారా? అని ప్రశ్నించారు. దళితులు జగన్మోహన్ రెడ్డి ని 420 గా భావిస్తున్నారన్నారు.

"విజయవాడలో నిర్మించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో కట్టారు. రాష్ట్ర బడ్జెట్ నిధులతో ఎందుకు కట్టలేదు. విశాఖ లో డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు అనేక ఇబ్బందులు పెట్టి చనిపోయేలా చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది.ఎన్నడూ లేని విధంగా దళితులపై దాడులు జరుగుతున్నాయి.కోడి కత్తి కేసులో శ్రీనివాస్ గత ఐదేళ్లుగా జైల్లో మగ్గుతున్నాడు.కోడి కత్తి కేసు లో జగన్ కోర్టుకు హాజరు కాకుండా దళిత కుటుంబాన్ని ఇబ్బందులు పెడుతున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి ,వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లే రాష్ట్రంలో పెత్తందారులు. జగన్ మంత్రివర్గంలో ఒక్క మంత్రి కైనా స్వతంత్రం ఉందా? ఒక్క మంత్రి అయినా తన శాఖపై సమీక్ష నిర్వహించగలరా.? మంత్రులు, వారి శాఖలు చెప్పిన వారికి లక్ష బహుమానం ఇస్తానని" మాజీ ఎంపీ ఎద్దేవా చేశారు. దళితులను వైసీపీ నుంచి బయటకు తీసుకువచ్చే బాధ్యత నేను తీసుకున్నాను. రాష్ట్రవ్యాప్తంగా దళితులను చైతన్యవంతులు చేయడానికి ఈనెల 11వ తేదీన రాజమండ్రిలో వేమగిరి లో దళిత సింహ గర్జన నిర్వహిస్తున్నామని చెప్పారు.




Tags:    

Similar News