Adani Group : అదానీ గ్రూప్​పై మరో పిడుగు.. ఈసారి OCCRP సంచలన ఆరోపణలు

Update: 2023-09-01 02:46 GMT

Adani Groupహిండెన్‌బర్గ్‌ నివేదికను మరువకముందే అదానీ వ్యాపార సామ్రాజ్యంపై మరోసారి పెద్ద ఎత్తున ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఈసారి ‘ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌’ (OCCRP) అనే అంతర్జాతీయ ఇన్వెస్టిగేటివ్‌ జర్నలిస్టుల నెట్‌వర్క్‌ అదానీ కంపెనీల లావాదేవీలపై ప్రశ్నలు సంధించింది. ‘అదానీ గ్రూప్‌ కంపెనీల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయి. ప్రమోటర్ల కుటుంబానికి బాగా దగ్గరి వ్యక్తులు అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో వందల మిలియన్ల డాలర్లను పెట్టుబడులుగా పెట్టి భారీగా లబ్ధి పొందారు. ఇందుకోసం మారిషస్‌ వంటి పలు దేశాల్లోని అనుమానాస్పద ఫండ్‌లను మాధ్యమంగా ఉపయోగించుకొన్నారు’ అని OCCRP సంచలన ఆరోపణలు చేసింది. 2013 నుంచి 2018 వరకూ తమ గ్రూపు కంపెనీల షేర్ల ధరలను విపరీతంగా పెంచుకునేందుకు ఈ మార్గాన్ని అనుసరించారని తెలిపింది. ‘అజ్ఞాత’ పెట్టుబడి సంస్థలను ఉపయోగించి వీళ్లు రహస్యంగా లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపించింది. ఈ మేరకు తమ వద్ద ఆధారాలున్నాయని పేర్కొంటూ గురువారం ఒక నివేదికను విడుదల చేసింది.




 


అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ ఖండించింది. తమను అప్రతిష్ఠపాలు చేయటం కోసమే పాత ఆరోపణలను మళ్లీ చేస్తున్నారని ప్రకటించింది. జార్జ్‌ సోరోస్‌ నిధులతో నడుస్తున్న కొన్ని ఫండ్‌లు విదేశీ మీడియాలోని ఓ విభాగం మద్దతుతో చేసిన మరో కుట్రగా దీనిని అభివర్ణించింది. పదేళ్ల క్రితం ముగిసిపోయిన కేసుల ఆధారంగా చేసిన ఆరోపణలు అని వీటిని తెలిపింది. ఓవర్‌ వ్యాల్యూయేషన్‌ జరగలేదని, లావాదేవీలన్నీ చట్టాలకు అనుగుణంగానే జరిగాయని ఇప్పటికే తమకు అనుకూలంగా తీర్పులు వచ్చాయని గుర్తు చేసింది. అయితే, ఓసీసీఆర్‌పీ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూపు సంస్థల షేర్లు అతలాకుతలమయ్యాయి. పది షేర్లలో తొమ్మిది 4శాతం వరకు నష్టపోయాయి. ఫలితంగా రూ.35 వేల కోట్లకు పైగా మార్కెట్‌ విలువ ఒక్కరోజులోనే హారతి కర్పూరంలా కరిగిపోయింది.




 


సెబీ నిబంధనల ప్రకారం, ఒక కంపెనీ ప్రమోటర్లు ఆ కంపెనీలో 75 శాతం వాటాలను మాత్రమే కలిగి ఉండాలి. మిగిలిన 25 శాతం వాటాలను బహిరంగంగా షేర్‌మార్కెట్లో అందుబాటులో ఉంచాలి. కానీ, అదానీ కుటుంబం ఈ నిబంధనను ఉల్లంఘించి తమకు చెందిన వ్యక్తుల ద్వారా తమ కంపెనీల్లో 75 శాతానికి మించి వాటాలను కొనేసిందని, తద్వారా షేర్‌మార్కెట్‌లో తమ కంపెనీ షేర్ల కృత్రిమ కొరతను సృష్టించి, డిమాండును పెంచి, వాటి ధరలను పెంచేసిందని ఓసీసీఆర్‌పీ ఆరోపణ. అదానీ గ్రూపు చైర్మన్‌ గౌతమ్‌ అదానీ అన్న వినోద్‌ అదానీకి సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులు(వారిలో ఒకరు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కి చెందిన నాజర్‌ అలీ షాబాన్‌ అహ్లి కాగా మరొకరు తైవాన్‌కు చెందిన చాంగ్‌ చుంగ్‌ లింగ్‌.) ఈ అక్రమ లావాదేవీలలో కీలకపాత్ర పోషించారని ఆరోపించింది.




Tags:    

Similar News