Byju Raveendran : ఉద్యోగుల జీతాల కోసం ఇల్లు తాకట్టు పెట్టిన కంపెనీ ఓనర్
ప్రముఖ భారతీయ ఎడ్ టెక్ స్టార్టప్ అయిన బైజూస్ దయనీయ పరిస్థితులను ఎదుర్కొంటోంది. ప్రస్తుతం ఉద్యోగుల జీతాలు, ఇతర చెల్లింపులకు సైతం డబ్బులు కొరవడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో బైజూస్ వ్యవస్థాపకుడు రవీంథ్రన్ ఉద్యోగుల జీతాలకు అవసరమైన మెుత్తాన్ని సమకూర్చుకునేందుకు ఏకంగా తన ఇంటిని తాకట్టుపెట్టినట్లు తెలిసింది. తన పేరుమీద ఉన్న ఇంటితో పాటు కుటుంబ సభ్యుల పేరుపై ఉన్న ఇతర ఆస్తులను సైతం తాకట్టుకి వినియోగించినట్లు వెల్లడైంది. 12 మిలియన్ డాలర్లను అప్పుగా పొందేందుకు బెంగళూరులోని రెండు ఇళ్లతో పాటు నిర్మాణంలో ఉన్న మరో విల్లాను దీనికోసం తాకట్టుపెట్టారని తెలుస్తోంది. ఈ నిధులు కంపెనీ మాతృ సంస్థ థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లో 15 వందల మంది ఉద్యోగులకు జీతాలు చెల్లించడంతో ఉపయోగపడతాయని కంపెనీతో దగ్గర సంబంధాలున్న వర్గాలు తెలిపారు.
గత వారాంతంలో కొంతమంది ఉద్యోగులకు జీతాలు అందకపోవడంతో.. వారికి సోమవారం తాకట్టు ద్వారా వచ్చిన డబ్బుతో చెల్లింపులు పూర్తి చేసినట్లు సమాచారం. కంపెనీని ఒడుదొడుకుల నుంచి గట్టెక్కించేందుకు రవీంద్రన్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. అలాగే ఆర్థిక ఒత్తిళ్ల నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు కంపెనీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ క్రమంలో అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న డిజిటల్ రీడింగ్ ప్లాట్‌ఫామ్‌ను 400 మిలియన్ డాలర్లకు విక్రయించే యత్నాల్లో ఉంది. మరోవైపు 1.2 బిలియన్ డాలర్ల రుణంపై వడ్డీ చెల్లింపుల విషయంలో బైజూస్ ఇప్పటికే న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.