ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఆప్ పార్టీ, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చుట్టు ఉచ్చు బిగుస్తున్న క్రమంలో.. వారికి మరో ఆరోపణ ఎదురైంది. ఖలిస్తానీ ఉగ్రవాది, సిక్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపర్వత్ పన్నున్ కేజ్రీవాల్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీకి ఖలిస్తానీ గ్రూపుల నుంచి భారీ ఆర్థిక సాయాన్ని అందించినట్లు చెప్పారు. 2014 నుంచి 2022 వరకు దాదాపు రూ.133.54 కోట్ల డబ్బును ఆప్ కు.. ఖలిస్తానీలు ట్రాన్స్ ఫర్ చేసినట్లు పన్నున్ బాంబు పేల్చారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేవిందర్ పాల్ సింగ్ బుల్లార్ రిలీజ్ కోసం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ డబ్బులు తీసుకున్నట్లు ఆ వీడియోలో పన్నున్ ఆరోపించారు.
1993 ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో బుల్లార్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్ట్ అయిన కేజ్రీవాల్.. ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. జైలు నుంచి ఢిల్లీ పరిపాలనను కేజ్రీవాల్ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించిన వివరాలను అధికారులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేజ్రీవాల్ ఫోన్ లోని ఆధారాలను సేకరిస్తున్నారు. అయితే ఆయన మరో ఫోన్ మిస్ అయినట్లు తెలిపారు.