Bird flu : ఏపీలో బర్డ్ ప్లూ టెన్షన్.. చికెన్ తినొద్దని సూచన!

Update: 2024-02-18 03:40 GMT

ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బర్డ్ ఫ్లూ కలకలం రేపడంతో పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి, నెల్లూరు జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కోళ్ల మృతికి బర్డ్ ఫ్లూ కారణమని నిర్ధారించారు. దీంతో ఏపీ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 721 ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 7వ తేదిన ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైందని, ఇప్పటి వరకూ 10 వేలకు పైగా పౌల్ట్రీ పక్షులు మరణించినట్లుగా అధికారులు భావిస్తున్నారు.




 


పక్షుల నమూనాలను భోపాల్ లోని ల్యాబ్‌కు పంపారు. ఆ నమూనాల్లో బర్డ్ ఫ్లూ ఉందని వైద్యులు గుర్తించారు. దీంతో పశుసంవర్థక శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి కీలక చర్యలు తీసుకున్నారు. చాలా ప్రాంతాల్లో చికెన్ షాపులను మూసివేయాలని ఆదేశించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు తక్షణ చర్యలు చేపడుతున్నారు. గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి ఆ వ్యాధిపై అవగాహన కల్పిస్తున్నారు. చనిపోయిన కోళ్లను శాస్త్రీయంగా ఖననం చేయాలని చికెన్ షాపుల యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.




 


బర్డ్ ఫ్లూ వ్యాప్తిని నిరోధించేందుకు 37 బృందాలను ఇప్పటికే రంగంలోకి దింపారు. ప్రజలు మూడు నెలల పాటు చికెన్ తినకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. గతంలోనూ ఈ వైరస్ బారిన పడి ఎన్నో లక్షల సంఖ్యలో కోళ్లు మృతిచెందాయి. వైరస్‌ను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టామని, ఒక వేళ ఎవరైనా జ్వరం లేదా ఇతర ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటే వెంటనే స్థానిక ఆరోగ్య కేంద్రంలో చేరి వైద్య పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచించారు. 


Tags:    

Similar News