సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు ప్రారంభం

Update: 2023-07-09 04:16 GMT

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బోనాల పండుగ నేడు ఘనంగా జరుగుతోంది. ఈ ఆదివారం నాడు సికింద్రాబాద్​ ఉజ్జయని మహాంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలి పూజల అనంతరం ఉదయం 3.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలతోపాటు బోనం సమర్పించారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కాగా, తెల్లవారుజాము నుంచే అమ్మవారి ఆలయానికి భక్తులు క్యూ కట్టారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆ ప్రాంతం అంతా భక్తులతో కిటకిటలాడుతోంది.

అధికారులు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా భద్రతా ఏర్పాట్లు నిర్వహించారు. భాగ్యనగరం అంతటా సందడిగా మారింది. కాగా, ఉదయం 9.30 గంటలకు ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. ఆదయ్య నగర్‌ కమాన్‌ వద్ద పూజల్లో పాల్గొంటారు. ఈ నెల 16న హైదరాబాద్ పాతబస్తీ బోనాలు నిర్వహించనున్నారు. ఈ బోనాలు వైభవంగా జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు కేటాయించారు.

బోనాల పండగ నేపథ్యంలో భక్తుల సౌకర్యం కోసం నగరంలో ఆర్టీసీ 150 ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. నగరంలో దాదాపు 19 ప్రాంతాల నుంచి బోనాల ఉత్సవాలు జరిగే ప్రాంతాలకు భక్తులు చేరుకునే విధంగా సిటీ బస్సులను తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.



Tags:    

Similar News