హైదరాబాద్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది బిర్యానీ.హైదరాబాద్ బిర్యానీ అంటే దేశవ్యాప్తంగా ఫుల్ ఫేమస్. బిర్యానీలు లాగించడంలో హైదరాబాదీల తర్వాతే ఎవరైనా అని మరోసారి రుజువైంది. గత ఆరు నెలల్లో హైదరాబాదీలు 72లక్షల బిర్యానీలను ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. ఇక గత 12 నెలల్లో ఆ సంఖ్య కోటిన్నర దాటింది. దీని బట్టి హైదరాబాదీలకు బిర్యానీ అంటే ఎంత మోజో అర్ధం చేసుకోవచ్చు.
2022తో పోల్చితే గత ఐదు నెలల్లో బిర్యానీ ఆర్డర్ల సంఖ్యలో 8.39 శాతం వృద్ధి నమోదైందని స్విగ్గీ వివరించింది. దమ్ బిర్యానీ 9 లక్షలకు పైగా ఆర్డర్‌లతో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. 7.9 లక్షల ఆర్డర్‌లతో ఫ్లేవర్డ్ బిర్యానీ సెకండ్ ప్లేస్లో ఉండగా.. మినీ బిర్యానీ 5.2 లక్షల ఆర్డర్‌లను అందుకుంది. ఇక కూకట్ పల్లి నుంచే ఎక్కువ ఆర్డర్స్ వచ్చినట్లు స్విగ్గీ తెలిపింది. ఆ తర్వా తి స్థానాల్లో వరుసగా మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి కొండాపూర్ ఉన్నాయి.
హైదరాబాద్‌లో 15వేలకు పైగా రెస్టారెంట్లు హైదరాబాదీ బిర్యానీని ఆఫర్ చేస్తున్నాయని స్విగ్గీ తెలిపింది. ప్రధానంగా కూకట్‌పల్లి, మాధాపూర్, అమీర్‌పేట, బంజారాహిల్స్, కొత్తపేట, దిల్‌షుక్‌నగర్ ప్రాంతాల్లోని రెస్టారెంట్లు ఎక్కువగా బిర్యానీ ఆఫర్ చేస్తున్నాయి. ఇవి నగరంలోని బిర్యానీ ఔత్సాహికులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.