హైదరాబాద్ నగరంలో ఈరోజు (బుధవారం) భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. జోన్లవారీగా హెచ్చరికలు జారీ చేసింది. చార్మినార్ జోన్, ఖైరతాబాద్ జోన్, ఎల్బీనగర్ జోన్, శేరిలింగంపల్లి జోన్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కూకట్‌పల్లి జోన్‌కు ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది. ఇక్కడ సైతం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.గంటలో 3 నుంచి 5 సెం.మీ. వర్షం కురిసే సూచనలున్నాయని, కొన్నిసార్లు 5 నుంచి 10 సెం.మీ. కూడా కావచ్చని వెల్లడించింది. గంటకు 10 నుంచి 14 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.
భారీ నుంచి అతి భారీ వర్షంతో రహదారులన్నీ జలమయమవుతాయని రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. గాలులతో చెట్లు నేలకూలే ప్రమాదం ఉండొచ్చని, విద్యుత్తు స్తంభాలు దెబ్బతినడం, కరెంటు సరఫరాలో అంతరాయాలకు అవకాశం ఉండొచ్చని తెలిపింది. అంతేకాకుండా చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తవచ్చని తెలిపింది. రేపు కూడా ఈ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పైన తెలిపిన ఐదు జోన్ల పరిధిలో ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. వీటి పరిధిలో గురువారం మోస్తరు నుంచి కొన్నిసార్లు భారీ వర్షం కురియవచ్చు. శుక్ర, శనివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం ఉండవచ్చని వెల్లడించింది. గంటలో 2 నుంచి 3 లేదా 5 సెం.మీ. దాకా వర్షపాతానికి వీలుంది.