independence day 2023 : సాతంత్ర్య దినోత్సవం రోజు తప్పకుండా వినాల్సిన తెలుగు పాటలు..
మాట కంటే పాట గొప్పది. చెప్పాల్సిన దాన్ని సూటిగా, రాగయుక్తంగా, భావోద్వేగంతో చెప్పేస్తుంది. అందుకే కావ్యాలకు, పద్యాలకు లేని ప్రఖ్యాతి పాటకు వచ్చింది. జానపదుల పాటల నుంచి నేటి లొల్లాయి సినీపాటల వరకు జీవితాన్ని ఎంతో అద్భుతంగా పరిచేసిన గేయ ప్రస్థానాన్ని సంస్కర్తలే కాకుండా ప్రభుత్వాలు కూడా విరివిగా వాడుకుంటున్నాయి. పాటను రాజకీయాల కోసం వాడుకోవడం ఇటీవలి ముచ్చటేమీ కాదు. భారత స్వాతంత్ర్యోద్యమంలో పాట మహత్తర పాత్ర పోషించి జనంలో స్వేచ్ఛ కాంక్ష రగిలించింది. జాతీయోద్యమంలో కవులు పాటలకు కత్తులు కట్టి తెల్లదొరలపై ఎక్కుపెట్టారు. పరాయి పాలనలో భారతావని కష్టాలను కళ్లకు కడుతూ ‘మాకొద్దీ తెల్లదొరతనము’ అని వీధుల్లో కదం తొక్కారు. భారతీయ ఆగ్రహాన్ని తట్టకోలేక తెల్లముష్కరులు దేశం వదిలిపోయారు. స్వాతంత్ర్యం సిద్ధించింది. కానీ కొన్నాళ్లకే కథ తిరిగి మొదటికొచ్చింది. తెల్లదొరల స్థానంలో నల్లదొరలు బయల్దేరి ప్రజాకంటకులుగా మారిపోయారు. కవులు ఈ ధోరణిని ఎండగడుతూ మళ్లీ పాటలు కట్టారు. ఈ పరిణామాలన్నింటి తెలుగు సినిమా కూడా ఉంది. దాని పాటా ఉంది. స్వతంత్రాభిలాషను రేకెత్తించి, పౌరులుగా మన బాధ్యతేంటో గుర్తు చేసే కొన్ని పాటలను పంద్రాగస్ట్ సందర్భంగా గుర్తు చేసుకుందాం..
టాలీవుడ్ తొలి సాంఘిక చిత్రం ‘వందేమాతరం’ నిజానికి రాజకీయాల్లో సంబంధం లేనిది. అయినా అందులో సంస్కరణాభిలాష కనిపిస్తుంది. ‘మనదేశం’, ‘ఎమ్మెల్యే’, ‘పెద్దమనుషులు’, ‘రోజులు మారాయి’, ‘ప్రజారాజ్యం’, ‘ముందడుగు’, ‘ఆంధ్రకేసరి’, ‘భారతీయుడు’ తదితర చిత్రాలు దేశభక్తిని రేకెత్తించాయి. దేశభక్తితో సంబంధం లేని సినిమాల్లోనూ సందర్భాన్ని బట్టి పంద్రాగస్ట్ చైతన్యాన్ని చాటే పాటలు ఉండేవి.
మహాకవి శ్రీశ్రీ ‘వెలుగు నీడలు’ చిత్రం కోసం రాసిన ‘పాడవోయి భారతీయుడా ఆడి పాడవోయి విజయగీతిక’ పాట నిత్యనూతనంగా ఉంటుంటుంది. ‘స్వాతంత్రం వచ్చెనని సంబరపడకోయి..’ అంటూ.. సమాజంలో ఇంకా అసమానతలు ఉన్నాయని, వాటిని పోగొట్టేందుకు కృషి చేయాలని బోధిస్తుంది. కోడలుదిద్దిన కాపురం చిత్రంలోని ‘ఈ సంఘం నీ సంఘం ఈ దేశం నువు మరవొద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవొద్దు’ పాట కూడా సందేశాత్మకమే.
దొంగరాముడు చిత్రంలో ‘భలే తాత మన బాపూజీ, బాలల తాతా బాపూజీ’ అంటూ జాతిపితను కీర్తిస్తారు. ‘గాంధీ పుట్టిన దేశం.. రఘురాముడు ఏలిన రాజ్యం ఇది సమతకు మమతకు సంకేతం’ పాట కూడా గొప్పదే. బడిపంతులు చిత్రంలోని ‘భారతమాతకు జేజేలు బంగరు భూమికి జేజేలు త్రివేణి సంఘమ పవిత్ర భూమి, నాలుగు వేదములు వెలసిన భూమి, గీతాసారం పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి’ అని చాటుతుంది.
జాతీయ అవార్డు గెలుచుకున్నఅల్లూరి సీతారామరాజు చిత్రంలోని ‘తెలుగు వీర లేవరా, దీక్షబూని సాగరా’ వింటే గుండెలు ఉప్పొంగుతాయి. మేజర్ చంద్రకాంత్ ‘పుణ్యభూమి నా దేశం నమోనమామి, ధన్యభూమి నా దేశం నమో నమామి’ సూపర్ హిట్ పాట. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా..’, ‘జన్మనీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ’, ‘అణువూ అణువున వెలసిన దేవా.. ’ వంటి మరెన్నో పాటలు తెలుగు ప్రజల, రచయితల, కళకారుల దేశాభిమానానికి మచ్చుతునకలు.