స్కూల్కు డుమ్మా కొట్టకుండా 50 దేశాలు చుట్టొచ్చిన చిన్నారి
ఓ పదేళ్ల చిన్నారి 50దేశాలను చుట్టొచ్చింది. అదీ కూడా స్కూల్కు ఒక్కరోజు డమ్మా కొట్టకుండా. ఆశ్చర్యంగా అనిపించిన ఇది వాస్తవం. బ్రిటన్‌లో భారత్కు చెందిన దీపక్ త్రిపాఠి, అవిలాష.. ఇద్దరి పిల్లలతో కలిసి నివాసముంటున్నారు. వారిద్దరూ బ్యాంకులో అకౌంటెంట్లుగా పనిచేస్తున్నారు. దీపక్, అవిలాష తమ కూతురు అదితి మూడేళ్లు ఉన్నప్పుడు జర్మనీకి తీసుకెళ్లారు. ఇక ఇప్పటినుంచి ఈ టూర్లు కొనసాగుతున్నాయి.
పక్కా ప్లాన్ ప్రకారం ఆ కుటుంబం టూర్లకు వెళ్తుండడంతో ఆ చిన్నారికి లీవ్ పెట్టే అవసరమే రాలేదు. ఆ తర్వాత నేపాల్, భారత్, థాయ్లాండ్, సింగాపూర్ వంటి ఎన్నో దేశాలను చుట్టొచ్చారు. అదితికి వివిధ ప్రాంతాలను చూపించడం వల్ల సమాజంపై అవగాహన పెరగడంతో పాటు వివిధ సంస్కృతి, సంప్రదాయాలు, రకరకాల మనుషుల గురించి అవగాహన ఏర్పడుతుందని తల్లిదండ్రులు చెబుతున్నారు.
‘‘ఏ దేశం వెళ్లాలో ముందుగానే అనుకుంటాం. అదితిని శుక్రవారం సాయంత్రం స్కూల్ నుంచి నేరుగా టూర్కు తీసుకెళ్తాం. ఆదివారం రాత్రి 11 గంటల లోపు ఇంటికి చేరుకునే విధంగా ప్లాన్ చేసుకుంటాం. ఒక్కోసారి టూర్ నుంచి రావడం ఆలస్యమైతే ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా స్కూల్‌కి వెళ్లిపోతుంది. టూర్ల కోసం ఏడాదికి రూ.21 లక్షలు ఖర్చు చేస్తాం. అదితికి రెండేళ్ల చెల్లెలు ఉంది. తనకూ వీలైనన్ని ఎక్కువ దేశాలను చూపిస్తాం’’ అని చిన్నారి తల్లిదండ్రులు వివరించారు.
తనకు నేపాల్, జార్జియా, అర్మేనియా అంటే ఎంతో ఇష్టమని అదితి చెబుతోంది. ‘‘ నేను ఎన్నో దేశాలు తిరిగాను. ఎన్నో విషయాలను నేర్చుకున్నా. పిల్లలంతా ఆయా దేశాలను చూడాలని కోరుకుంటున్నా. ఎందుకంటే పర్యటనల వల్ల మనం ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు’’ అని అదితి చెప్పింది.