చైనాలో ఘోరం జరిగింది. హీలాంగ్‌జియాంగ్ ప్రావిన్స్‌లో జరిగిన ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. క్వికిహార్‌లోని ఓ మిడిల్ స్కూల్‌లో జిమ్ పైకప్పు ఒక్కసారిగా కూలిపోవడంతో 11 మంది చనిపోయారు. శిథిలాల కింద మరో నలుగురు చిక్కుకుపోయి ఉండగా వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 3 గంటలకు ఈ ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో జిమ్ లో 19 మంది ఉన్నట్లు అధికారులు చెప్పారు.
సహాయక సిబ్బంది ఇప్పటి వరకు శిథిలాల కింది నుంచి 15 మందిని బయటకు తీశారు. వారిలో నలుగురు మాత్రమే బతికి ఉన్నారని అధికారులు చెప్పారు. బాధితులంతా స్కూల్ విద్యార్థులేనని అన్నారు. రెస్క్యూ ఆపరేషన్ లో 39 ఫైరింజన్లు, 160 మంది ఫైర్ ఫైటర్లు పాల్గొన్నారు. జిమ్ నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు భారీ వర్షాల కారణంగా జిమ్ పైకప్పు కూలిందని ప్రాథమికంగా నిర్థారించారు.