బతుకుతెరువు కోసం విదేశాలకు వెళ్తున్న వలసదారుల ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. గ్రీస్ తీరంలో జరిగిన భారీ పడవ ప్రమాదంలో 78 మంది మృతిచెందగా, పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. సహాయక సిబ్బంది 104 మందిని కాపాడారు. గల్లంతైన వారి కోసం గ్రీస్ ప్రభుత్వం భారీ స్థాయిలో గాలింపు చర్యలు సాగిస్తోంది. పెద్ద సంఖ్యలో పడవలు, విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లను రంగంలోకి దించింది.
సూడాన్, సిరియా, ఈజిప్ట్, పాకిస్తాన్ తదితర దేశాలకు చెందిన అక్రమ వసలదారులు లిబియాలోని తోబ్రక్ నుంచి ఓ చేపల పడవలో ఇటలీకి బయల్దేరారు. గ్రీస్ తీరంలోని పెలోపెనీస్ ప్రాంతంలో తీరగస్తీ దళాల కన్నుగప్పి వెళ్తుండగా పెనుగాలులు వీచడంతో పడవ బోల్తాపడింది. గ్రీస్, ఇటలీ నేవీలు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. ప్రమాదం నేపథ్యంలో లిబియా ప్రభుత్వం అక్రమ పడవ ప్రయాణాలపై కొరడా ఝుళిపించింది. పలు ఆఫ్రికా, ఆసియా దేశాలకు చెందిన వలసదారులను వారి స్వదేశాలకు పంపిస్తోంది. అంతర్యుద్ధాలు, కరువు, పేదరికం, నిరుద్యోగం తదితర సమస్యల కారణంగా లిబియా, సిరియా, సూడాన్ తదితర దేశాల నుంచి భారీ సంఖ్యలో యూరప్‌కు అక్రమంగా వలస వెళ్తున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మార్చి మధ్య 38 వేల మంది యూపర్ చేరుకున్నురు. ఈ సంఖ్య గత ఏడాది వలసల కంటే ఇది రెట్టింపు.