Maldives : మాల్దీవులకు షాక్..భారీగా తగ్గిన ఇండియన్ టూరిస్ట్స్...అట్లుంటది మనతోని!
ఎవరికైన ఆపద వస్తే సహాయం చేయడంలో మన భారతీయులు ఎప్పుడూ ముందుంటారు. అదే మన ఇండియన్స్ జోలికి వస్తే కథ ఎంట్లుంటదీ మరి. యూనీటిగా ఉండడంలో మన తర్వతే ఏవరైనా అని మరోసారి రుజువైంది. భారత్‌తో దౌత్యపరమైన వివాదానికి తెరలేపిన మాల్దీవులకు గట్టి షాక్ తగిలినట్లుగా కనిపిస్తోంది. నిత్యం పెద్ద ఎత్తున భారత్ నుంచి మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల సంఖ్య విపరీతంగా తగ్గింది.
ప్రధానీ మోదీ జనవరి 2న లక్షద్వీప్ పర్యటన తర్వాత మాల్దీవులతో తలెత్తిన దౌత్యపరమైన వివాదం ఆ దేశ పర్యటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భారత్ నుంచి మాల్దీవుల పర్యటనకు వెళ్తున్న వారి సంఖ్య భారీగా తగ్గింది. గతేడాది మాల్దీవులకు వెళ్లిన విదేశీ పర్యాటకుల్లో రెండు లక్షలకు పైగా మంది టూరిస్ట్ లతో భారత్ అగ్ర స్థానంలో నిలిచింది. కానీ వివాదం జరిగిన కొద్ది రోజుల్లోనే ఆ ర్యాంకింగ్ ఐదో స్థానానికి పడిపోయింది. భారత సెలెబ్రెటీలు, ప్రముఖులు, సామాన్యుల నుంచి ఎదురైన వ్యతిరేకతే ఇందుకు ప్రధాన కారణమైంది. ప్రధాని మోదీపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం నెలకొనడంతో..మాల్దీవుల పర్యటకంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
యూనియన్ టెరిటరీ లక్షద్వీప్‌లో ప్రధాని మోదీ జనవరి 2న పర్యటించారు. లక్షద్వీప్ లోని అందాలను రమణీయమైన ప్రకృతిని కలియతీరిగారు. సముద్రం ఒడ్డున కాసేపు సేద తీరి అక్కడి వాటర్ లో స్నార్కెలింగ్ చేశారు. సాహసాలు చేయాలనుకునే వారు తమ లిస్ట్‌లో లక్షద్వీప్‌ను కూడా చేర్చుకోవాలని కోరుతూ అక్కడి ఫొటోలను ప్రధాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనిపై మాల్దీవుల ఎంపీ జహీద్ రమీజ్ అక్కసును వెల్లగక్కారు. టూరిజంలో మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని ట్వీట్ చేశారు. తర్వాత మాల్దీవుల మంత్రులు ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత నెటిజెన్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. మాల్దీవుల పర్యటనను వెంటనే మానుకోవాలని సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు నెటింట బాగా ట్రెండ్ అయ్యాయి. ఇది ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలను దెబ్బతీసే స్థాయికి చేరింది. తాజాగా ఈ పరిణామాలు ఆ దేశ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి.
గతేడాది డిసెంబరు 31 నాటికి ఇండియా నుంచి 2,09,198 మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. అప్పుడు ఆ దేశ పర్యాటక మార్కెట్‌లో 11 శాతం వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రష్యా రెండు, చైనా మూడు, బ్రిటన్ నాలుగో స్థానంల్లో నిలిచాయి. గత మూడు వారాలుగా మాల్దీవుల పర్యాటక జాబితాను పరిశీలిస్తే.. అప్పటివరకు ఫస్ట్ ప్లేస్ లో ఉన్న భారత్ కొంతకాలంలోనే ఐదో స్థానానికి పడిపోయింది. 13,989 మంది మాత్రమే మాల్దీవులను సందర్శించారు. 18,561 మంది పర్యాటకులతో రష్యా మొదటి స్థానంలో నిలిచింది. 18,111 మంది పర్యాటకులతో ఇటలీ రెండో స్థానంలో ఉండగా..చైనా 16,529, బ్రిటన్ 14,588 మంది పర్యాటకులతో మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి.