సాయం చేయండి ప్లీజ్..వలసపోతున్న మొరాకో భూకంప బాధితులు
మొరాకోలో ఏర్పడిని తీవ్ర భూకంపం పెను విధ్వంసాన్ని సృష్టించింది. నార్త్ ఆఫ్రికాలో 120 ఏళ్లలో ఇంతటి స్థాయిలో భూమి కంపించడం ఇదే తొలిసారి.
మొరాకోలో ఎటు చూసినా ప్రస్తుతం మృత్యుఘోషే వినిపిస్తోంది. ఇళ్లన్నీ ధ్వంసం అయ్యాయి. వేలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు, కట్టుబట్టలతో, కన్నీటితో మిగిలిపోయారు. ఈ ప్రకృతి విలయంతో ఇప్పటి వరకు దాదాపు 2వేలకు పైగా ప్రజలు చనిపోయారు. శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నారు. వీరి పరిస్థితి కూడా ఆందోళకరంగా ఉన్నట్లు సమాచారం. పర్వత శ్రేణి ప్రాంతం కావడంతో భూకంప బాధితులకు సహాయం అందడం కష్టతరంగా మారింది. రోడ్లు సరిగా లేకపోవడంతో రెస్క్యూ టీమ్స్ అక్కడికి వెళ్లలేకపోతున్నాయి. దీంతో అట్లాస్ పర్వతాలను వీడి సాయం కోసం ప్రజలు పెద్ద ఎత్తున వలసపోతున్నారు.
మొరాక భూకంపంలో చనిపోయిన వారి సంఖ్య 2,100ను దాటేసింది. ఇంకా వందలాది మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. అయితే వీరు సజీవంగా బయటకు వస్తారన్న ఆశలు మాత్రం క్రమంగా కనుమరుగవుతున్నాయ. ఇప్పటికే భూకంపం వచ్చి 48 గంటలు దాటిపోయింది. కొండల్లో , మారుమూల గ్రామాల్లో భవనాలు కుప్పకూలిపోవడంతో రెస్క్యూ టీమ్స్ కోసం బాధితులు వెయిట్ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ భారీ భూకంపంతో అట్లాస్ పర్వతాలకు కిలోమీటరు దూరంలో ఉన్న మారుమూల గ్రామం తిఖ్త్ మొత్తం నేలమట్టమైంది.ఇక్కడి ప్రజలు కట్టుబట్టలతో నిరాశ్రయులయ్యారు.
మొరాకో భూకంప బాధితులకు సాయం అందించేందుకు ఇప్పుడిప్పుడే ఫారెన్ టీమ్స్ అక్కడకు వస్తున్నాయి. యూకే, ఖతర్, యూఏఈ, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాలు సాయం చేసేందుకు ముందుకువచ్చాయి. తాజాగా మొరాకో ప్రభుత్వం కూడా వారి సాయాన్ని అంగీకరించింది. పక్కనే ఉన్న స్పెయిన్ కూడా రెండు టీమ్‌లలో 86 మంది ఎక్స్‌పర్ట్స్‌ను భూకంప బాధిత ప్రాంతానికి పంపించింది. యూకే నుంచి 60 మంది టీమ్‌తో రెండు మిలిటరీ ట్రాన్స్పోర్ట్ హెలికాప్టర్లు, మెడికల్ టీమ్‌లు బయల్దేరాయి. ఈ క్రమంలో తమకు సాయం అందించేందుకు వచ్చిన దేశాలకు మొరాకో రాజు మహమ్మద్-6 ధన్యవాదాలు తెలిపారు.