తమ దేశ పౌరుల సంరక్షణకు పెద్దపీట వేసింది అగ్రరాజ్యం అమెరికా. తాజాగా జరిగిన సంఘటన అందుకు ఉదాహరణగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అగ్రరాజ్యమైనా తమ వారి రక్షణే ముఖ్యమనుకుని ఓ మెట్టు దిగింది. శత్రుదేశమైనా తలవంచింది. రాజకీయ లబ్దికంటే పౌరుల ప్రాణాలే ముఖ్యమనుకుంది. అందుకోసం ఏకంగా 49వేల కోట్ల రూపాయలను అవలీలగా వదులుకుంది. వివిధ అభియోగాలతో గత కొన్నేళ్లుగా ఇరాన్లో ఐదుగురు అమెరికన్లు ఖైదీలుగా ఉన్నారు. వీరిని విడిపించేందుకు బైడెన్ సర్కార్ 6 బిలియన్ డాలర్లను వదులుకుంది. సుదీర్ఘకాలంగా విరోధులుగా కొనసాగుతున్న రెండు దేశాల మధ్య ఈ అరుదైన ఖైదీల మార్పిడి జరగడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
ఇరాన్లో ఏళ్లుగా బందీలుగా ఉన్న అమెరికన్లు :
ఐదుగురు పౌరుల ప్రాణాలను రక్షించేందుకు అగ్రరాజ్యం అమెరికా అక్షరాలా 50వేల కోట్ల రూపాయలను వదులుకుంది. తమ పౌరుల ప్రాణాలకంటే ఏదీ ఎక్కువ కాదని శత్రు దేశం ముందు తలవంచింది. అమెరికా సర్కార్ తీసుకున్న ఈ అసాధరణ నిర్ణయంతో... ప్రాణాలపై ఆశలు వదులుకున్న ఐదుగురు పౌరులు తిరిగి తమ సొంత గడ్డపై కాలు మోపారు. ఇకరారు అని అనుకున్న తమవారిని కలుసుకుని కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ తీసుకున్న ఈ నిర్ణయంపై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
సయోధ్య కుదిర్చిన ఖతార్ :
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని అత్యంత క్రూరమైన ఎవెన్ జైలులో ఐదుగురు అమెరికన్లు బందీలుగా ఉన్నారు. అయితే రాజకీయ లబ్దికోసమే నిరాధారమైన అభియోగాలతో తమవారిని ఇరాన్ బంధీలుగా మార్చిందని అమెరికా ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. తమ పౌరులను ఎవిన్ జైలు నుంచి విడిపించేందుకు అమెరికా ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇరాన్‌తో జరిపిన చర్చలు పలుమార్లు విఫలం అయ్యాయి. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఖతార్ ముందుకు వచ్చింది. ఖైదీల మార్పిడి కోసం ఖతార్ మధ్యవర్తిత్వంలో గత ఏడాది ఫిబ్రవరీలో చర్చలు ప్రారంభం అయ్యాయి. తాజాగా జరిగిన ఒప్పందానికి కూడా ఖతార్ మధ్యవర్తిత్వం వహించింది. ఈ అగ్రిమెంట్లో భాగంగా దక్షిణ కొరియాలో ఇరాన్ నిధులను విడుదల చేసేందుకు అమెరికా అంగీకరించింది.
ఇరానీలకు క్షమాభిక్ష :
ఖైదీల మార్పిడి అగ్రిమెంట్ చివరి దశకు చేరుకుంటుందనే సూచనలు రాగానే ఇరాన్ అలర్ట్ అయ్యింది. అవెన్ జైలులో బందీలుగా ఉన్న అమెరికన్లను జైలు నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించింది. అదే విధంగా దక్షిణ కొరియాలో నిలిచిపోయిన ఇరాన్ నిధులు దోహా బ్యాంకులకు చేరుకోగానే అమెరికా పౌరులను టెహ్రాన్ నుంచి దోహాకు తరలించారు. ఆ తర్వాత అక్కడి నుంచి వారు అమెరికాకు చేరుకున్నారు. ఇదే క్రమంలో ఒప్పందంలో భాగంగా అమెరికా ఆంక్షలు ఉల్లంఘించారనే ఆరోపణలతో యూఎస్ జైల్లో ఉన్న ఐదుగురు ఇరానీలకు అమెరికా ప్రభుత్వం క్షమాభిక్ష లభించింది. అమెరికా చొరవతో ఎన్నో ఏళ్లుగా ఇరాన్ జైల్లో చిక్కుకున్న అమెరికన్లు తమ సొంత గడ్డపై కాలుమోమారు. తమవారిని చూస్తూ భావోద్వేగానికి గురయ్యారు. ఈ సంఘటనతో అమెరికా పెద్ద మనసు అందరికీ అర్థమైంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.