Lok Sabha : భద్రతా వైఫల్యం.. లోక్సభలో రచ్చ చేసిన ఆగంతకుడు
పార్లమెంటులో భద్రతా వైఫల్యం బయటపడింది. లోక్ సభ సమావేశాలు జరుగుతున్న సమయంలో అగంతకులు టియర్ గ్యాస్ వదిలాడు. జీరో అవర్ జరుగుతున్న సమయంలో విజిటర్స్ గ్యాలరీ నుంచి సభలోకి దూకిన ఆగంతకుడు అలజడి సృష్టించాడు. ఎవరూ పట్టుకునే వీలులేకుండా టేబుళ్లపై ఎక్కి అటూ ఇటు తిరిగాడు. టియర్ గ్యాస్ వదిలి ఎంపీలను భయభ్రాంతులకు గురిచేశాడు. వెంటనే అప్రమత్తమైన స్పీకర్ సభను వాయిదా వేశారు. మరోవైపు ఎంపీలంతా భయంతో బయటకు పరుగులు తీశారు. సభలో భద్రతా వైఫల్యంపై ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు పార్లమెంటు బయట కూడా ఇద్దరు ఆందోళనకారులు వీరంగం సృష్టించారు. ఓ పురుషుడితో పాటు మహిళ కలర్ స్మోక్ తో నిరసనకు దిగారు. వెంటనే అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు ట్రాన్స్పోర్ట్ భవన్ వద్ద వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.
పార్లమెంటు బిల్డింగుపై ఉగ్రదాడి జరిగి నేటితో 22 ఏండ్లు పూర్తయ్యాయి. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్ భవనంపై ఉగ్రవాదులు దాడి చేశారు. సరిగ్గా అదే రోజున మళ్లీ సభలో ఇలాంటి పరిస్థితి తలెత్తడంపై ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.