కెనడాలో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు మార్లు హిందూదేవాలయాలపై దాడి చేసిన ఖలీస్థాన్ మద్దతుదారులు మరోసారి రెచ్చిపోయారు. బ్రిటీష్ కొలంబియాలో ఉన్న అతిపెద్ద, పురాతన ఆలయాన్ని ధ్వంసం చేశారు. అనంతరం ఆలయ ప్రధాన ద్వారానికి ఖలిస్తాన్ పోస్టర్లను,ఇటీవల హత్యకు గురైన హర్‌దీప్ సింగ్ నిజ్జర్ ఫోటోలను ఆలయంలో భారీగా అతికించారు. సీసీ కెమెరాలో ఇందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి.
ఖలిస్థాన్ వేర్పాటువాద ఉద్యమానికి నేతృత్వం వహించిన హర్‌దీప్ సింగ్ కొలంబియాలోనే హత్యకు గురయ్యారు. జూన్ 18న ఇద్దరు దుండగులు గురుద్వారా ప్రాంగణంలోనే హర్‌దీప్ సింగ్‌ని
అంతమొందించారు. ఈ హత్య భారత్ చేయించిందని ఖలీస్థానీలు ఆరోపిస్తున్నారు. కానీ..భారత్ సహా కెనడా ఈ ఆరోపణల్ని ఖండించాయి. దీనికి నిరసనగానే.. ఖలీస్థాన్ మద్దతుదారులు ఆలయాలపై దాడులకు పాల్పడుతున్నారు.
ఈ ఏడాదిలోనే కెనాడాలోని హిందూ దేవాలయలపై జరిగిన దాడుల్లో ఇది మూడోది. గతంలో రెండు ఇదే తరహాలో హిందూదేవాలయాలపై దాడులు చేశారు. . ఈ ఏడాది జనవరి 31న బ్రాంప్టన్ లోని హిందూ ఆలయాన్ని ధ్వంసం చేయగా, ఏప్రిల్ లోని ఒంటారియోలో మరో దేవాలయాన్ని కూల్చివేశారు. ఇలాంటి ఘటనలు తరచూ జరగడంపై హిందూవులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేక దేశం ‘ఖలిస్తాన్’ను ఏర్పాటుచేయాలంటూ సిక్కుల కోసం ఉద్యమం సాగిస్తున్నారు. దీని భాగంలో ఖలీస్థాన్ మద్దతుదారల ఆగడాలు శ్రుతిమించుతున్నాయి. ప్రధానంగా
కెనడా, యూకే, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో రెచ్చిపోతున్నారు. హిందూ ఆలయాలు, భారత కాన్సులేట్స్‌ను లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారు.