ఎన్ని కఠిన చట్టాలున్నా ఆడవాళ్లపై అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. మన దేశాంలోనే కాదు మిగితా దేశాల్లోనూ కామాంధుల కీచకపర్వానికి అడ్డుకట్ట పడడం లేదు. సాక్ష్యాత్తు ఓ దేశ పార్లమెంట్లోనే మహిళ ఎంపీపై లైంగిక దాడి జరగడం శోచనీయం. ఆడవారికి పార్లమెంట్లోనే రక్షణ లేకపోతే ఇంకెక్కడ ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో తనపై ఓ ఎంపీ లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళా ఎంపీ లిడియా థోర్ప్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య దేవాలయంగా పిలిచే ఈ పార్లమెంట్ భవనం మహిళలు విధులు నిర్వర్తించడానికి సురక్షితంగా లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సెనేటర్ డేవిడ్ వాన్ తనతో దారుణంగా ప్రవర్తించారని ఆమె ఆరోపించారు. ఈ మేరకు సెనేట్ సభలో ప్రసంగిస్తూ ఆమె కన్నీటిపర్యంతమయ్యారు.
‘‘నన్ను డేవిడ్ వ్యాన్ అనుసరించడంతోపాటు అభ్యంతరకరంగా తాకేవారు. దీంతో ఆఫీసు గదిలో నుంచి బయటకు రావాలంటేనే భయపడేదాన్ని. డోర్ కొంచెం తెరిచి బయట ఆయన లేరని నిర్ధారించుకున్న తర్వాతే వచ్చేదాన్ని. పార్లమెంట్లో నడవాల్సి వచ్చినప్పుడు తోడుగా ఎవరో ఒకరు ఉండేలా చూసుకునేదాన్ని. నాలాగే ఇంకొందరు కూడా ఇలాంటి వేధింపులు అనుభవిస్తున్నారని తెలుసు. కానీ, కెరీర్ పోతుందని భయపడి వారు బయటకు రావట్లేదు. ఈ భవనం మహిళలకు సురక్షిత ప్రదేశం కాదు’’ అని ఆమె వాపోయారు.
పార్లమెంట్ నిబంధనలకు అనుగుణంగా దీనిపై తాను కేసు పెట్టనున్నట్లు థోర్ప్ స్పష్టం చేశారు. అయితే, ఈ ఆరోపణలను డేవిన్ వాన్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. దీనిపై తాను న్యాయపరంగా పోరాడుతానని చెప్పారు. ఆస్ట్రేలియా పార్లమెంట్‌లో ఇలాంటి ఘటనలు జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఓ మహిళ కూడా పార్లమెంట్‌లో తనపై అత్యాచారం జరిగిందని ఆరోపించింది.