ఖలిస్తాన్ వేర్పాటువాద ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో కెనడా, భారత ప్రభుత్వాల మధ్య రేగిన వివాదానికి ఇప్పట్లో తెరపడేలా లేదు. ఎదుటి దేశపు రాయబారులను పరస్పరం బహిష్కరిచుకున్న రెండు దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనకు భారత్‌ను రెచ్చగొట్టే ఉద్దేశం లేదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మంగళవారం అన్నారు. అయితే నిజ్జర్ హత్యను భారత్ తీవ్రంగా పరిగణించాల్సిందేనని స్పష్టం చేశారు. ‘‘’భారత్‌ను రెచ్చగొట్టాలని నేను ప్రయత్నించడం లేదు. ఉద్రిక్తతను మరింత పెంచాలని కూడా అనుకోవడం లేదు. కానీ ఈ హత్యపై కొన్ని ప్రశ్నలకు మాకు సమాధానాలు రావాల్సిందే. అన్నీ స్పష్టంగా నిగ్గుదేల్చేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకుంటున్నాం’’ అని అన్నారు.
కెనడియన్ పౌరుడైన హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తం ఉందని ట్రూడో సోమవారం చెప్పడంతో వివాదం రేగింది. ఆయన అంతటితో ఊరుకోకుండా కెనడాలోని భారత దౌత్యవేత్తను బహిష్కరించారు. దీనికి బదులుగా భారత్ కూడా ఢిల్లీలోని కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది. ట్రూడో వ్యాఖ్యలు అసంబద్దంగా, ఏదో దురుద్దేశంతో చేసినట్లుగా ఉన్నాయని మండిపడిది.ఈ వివాదంలో అమెరికా కూడా తల దూర్చింది. ట్రూడో ఆరోపణలు తమకు తీవ్ర ఆందోళనకు గురిచేశాయని వైట్ హౌస్ ప్రతినిధి అన్నారు.
కెనడాలో పలువురు సిక్కుసంతతి అతివాదులు భారత నుంచి పంజాబ్‌ను విడగొట్టి ఖలిస్తాన్ పేరుతో ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని డిమాండు చేస్తుంటారు. కెనడా ప్రభుత్వం వాళ్లను చూసీచూడనట్లు వదిలేస్తుంటుంది. వాళ్లను అధికారిక కార్యక్రమాలకు కూడా ఆహ్వానిస్తుంటుంది. వాళ్ల మాటలు భావప్రకటన స్వేచ్ఛ అంటూ ఉదారంగా ఉండడంతో ఖలిస్తాన్ వేర్పాటువాదులు హల్ చల్ చేస్తుంటారు.