Joe Biden's Convoy : అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

Byline :  Veerendra Prasad
Update: 2023-12-18 04:59 GMT

అమెరికాలో కలక​లం చోటుచేసుకుంది. అధ్యక్షుడు జో బైడెన్‌ కాన్వాయ్‌ను గుర్తు తెలియని వ్యక్తి ఢీకొట్టాడు. ఈ ఘటనలో ప్రెసిడెంట్‌, ప్రథమ మహిళ జిల్ బైడెన్ సురక్షితంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. వెంటనే స్పందించిన పోలీసులు కారు నడిపిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డెలావేర్‌లో ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ కాన్వాయ్‌పై ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అక్కడ డిన్నర్‌ ముగించుకుని బైడెన్‌ దంపతులు ఆఫీసు బయట ఉన్న కాన్వాయ్‌ వద్దకు వస్తుండగా.. ఓ కారు వేగంగా దూసుకొచ్చి కాన్వాయ్‌లోని యూఎస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ వాహనాన్ని ఢీకొంది.

ఆ సమయంలో జిల్‌ బైడెన్‌ అధ్యక్ష వాహనంలో కూర్చుని ఉండగా.. జో బైడెన్‌ వాహనానికి సమీపంలోనే ఉన్నారు. బైడెన్‌కు కేవలం 130 అడుగుల దూరంలో ఈ ఘటన జరిగింది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది బైడెన్‌ను వేగంగా అధ్యక్ష వాహనంలోకి తీసుకెళ్లారు. మరోవైపు, ఘటనకు పాల్పడిన వాహనాన్ని సీక్రెట్‌ సర్వీస్‌ సిబ్బంది చుట్టుముట్టి సదరు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటన నేపథ్యంలో బైడెన్‌ దంపతులను వెంటనే వైట్‌హౌస్‌కు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.




Tags:    

Similar News