Meta : డీప్‌ఫేక్‌కు చెక్..ప్రముఖ టెక్ సంస్థ మెటా కీలక నిర్ణయం
టెక్నాలజీ పెరగడం వల్ల ఎంత మేలు జరుగుతుందో..దానిని చెడుకు వాడితే అంతే కీడు జరుగుతుంది. ఈ మధ్య టెక్నాలజీని కొందరు ఆసరాగా వాడుకొని తప్పుడు దారుల్లో వెళ్తున్నారు. అయితే ఈ మధ్య డీప్‌ఫేక్‌ల బెడద ఎక్కువవుతోంది. ఆ మధ్య హీరోయిన్ రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియో ఎంత వైరల్ అయ్యిందో మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్(AI) ఆధారంగా రూపొందిస్తున్న ఇలాంటి తప్పుడు సమాచారానికి చెక్ పెట్టేందుకు..వాట్సప్‌లో ప్రత్యేక ఫ్యాక్ట్ చెక్ హెల్ప్‌లైన్‌ను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు ‘మిస్‌ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయన్స్ (MCA)’తో భాగస్వామ్యం అవుతున్నట్లు తెలిపింది. వచ్చే నెల మార్చి నుంచి ఇది ప్రజలకు అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది.
ఈ హెల్ప్‌లైన్ సాయంతో MCA, దాని అనుబంధ ఇన్డిపెండెంట్ ఫ్యాక్ట్-చెకర్లు, రీసర్చ్ సంస్థలు వైరలవుతున్న తప్పుడు సమాచారాన్ని, ముఖ్యంగా డీప్‌ఫేక్‌లను గుర్తిస్తాయని మెటా తెలిపింది. ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషలకు స్పందించే వాట్సప్ (WhatsApp) చాట్‌బాట్‌ను సంప్రదించి ప్రజలు డీప్‌ఫేక్‌లపై సమాచారాన్ని పొందొచ్చని చెప్పింది. హెల్ప్‌లైన్ ద్వారా వచ్చే మెసేజ్‌ల నిర్వహణ కోసం ఎంసీఏ ‘డీప్‌ఫేక్ అనాలసిస్ యూనిట్’ ప్రత్యేకంగా తీసుకొస్తుందని తెలిపింది.
తప్పుడు సమాచారాన్ని గుర్తించడం, అరికట్టడం, ప్రజలకు అవగాహన కల్పించడం, సరైన సమాచారాన్ని అందుబాటులో ఉంచడమే ఈ హెల్ప్‌లైన్ ముఖ్య ఉద్దేశమని తెలిపింది. ఈ సదవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని సూచించింది. వాట్సప్‌లో అనుచితంగా వచ్చే మెసేజ్‌లను ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని మెటా కోరింది.