బుద్ధి మార్చుకోని చైనా.. కొత్త మ్యాపుల్లో భారత భూభాగాన్ని కలిపేసుకున్న డ్రాగన్ కంట్రీ

Byline :  Bharath
Update: 2023-08-29 15:00 GMT

చైనా దేశం మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఓ వైపు చర్చలంటూనే.. మరోవైపు రెచ్చగొడుతోంది. తాజాగా 2023 ఎడిషన్ పేరుతో చైనా.. ఆ దేశ కొత్త మ్యాప్ ను విడుదల చేసింది. అందులో భారత భూభాగమైన అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయ్చిన్ వంటి వివాదాస్పద భూభాగాలను, తైవాన్, దక్షిణ చైనా సముద్రంలోని భూభాగాలన్నీ తమ దేశ అంతర్భాగాలుగా పేర్కొంటూ మ్యాప్ రిలీజ్ చేసింది. అంతేకాకుండా అరుణాచల్ ప్రదేశ్ లోని కొంత భాగాన్న దక్షిణ టిబెట్ గా తమ మ్యాప్ లో పేర్కొన్నారు. 1962 యుద్ధంలో అరుణాచల్‌ ప్రదేశ్‌లోని సగానికిపైగా భూభాగాన్ని ఆక్రమించిన చైనా.. కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత తన సైన్యాన్ని మెక్‌మోహన్‌ రేఖ నుంచి వెనక్కి రప్పించింది.

అరుణాచల్‌ప్రదేశ్‌ ను దక్షిణ టిబెట్‌ గా పరిగణిస్తున్న చైనా.. టిబెట్‌ బౌద్ధ మత గురువు దలైలామా నుంచి భారత ప్రధాని వరకూ అరుణాచల్‌ను సందర్శించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే వచ్చింది. గతంలో కూడా మూడుసార్లు చైనా భారత భూభాగాల్ని తమ మ్యాపుల్లో కలుపుకుంది. 2017లో అరుణాచల్ ప్రదేశ్ లోని 11 ప్రాంతాల పేర్లు మార్చింది. 2021లో కూడా 21 ప్రాంతాల పేర్లు మార్చంది. ఆగస్ట్ 18న వెలువడ్డ శాటిలైట్ చిత్రాల ద్వారా.. చైనా ఆగడాలు మరోసారి బయటపడ్డాయి. అక్సాయి చిన్ వద్ద రోడ్లు, శాశ్వత సైనిక గుడారాల నిర్మాణం చేపట్టింది. భారీ యంత్రాలు, ట్రక్కులతో పనులు జరుపుతున్న వివరాలు బయటకు వచ్చాయి. వాస్తవాధీన రేఖకు 65 కిలోమీటర్ల దూరంలో ఈ నిర్మాణాలు చేపట్టడం కలకలం రేపుతోంది.





Tags:    

Similar News