ఐదో అంతస్తులో ఆవులు.. బాల్కనీలో సీన్ చూసి షాకైన జనం

Update: 2023-07-23 14:15 GMT

అతనో రైతు. వ్యవసాయంతో పాటు ఇంటి దగ్గర ఆవులను పెంచేవాడు. అయితే కొన్నాళ్ల క్రితం ప్రభుత్వం అతను నివాసముంటున్న ఊరిని ఖాళీ చేయించింది. దగ్గరలోనే అపార్ట్మెంటు నిర్మించి గ్రామస్థులందరికీ పునరావాసం కల్పించింది. అయితే ఇంతకాలం తమతో ఉన్న ఆవులను వదిలి ఉండలేక ఓ మాస్టర్ ప్లాన్ వేశాడు. చివరకు విషయం బయటపడటంతో లబోదిబోమంటున్నాడు.

చైనాలోని సిచువాన్‌ ప్రావిన్స్‌కు చెందిన ఓ రైతు తన ఇంటి ఐదో అంతస్తులోని బాల్కనీలోకి 7 ఆవులను పెంచుతున్నాడు. వాటికి గడ్డిపెడుతూ పోషించడం మొదలుపెట్టాడు. అవి గట్టిగా అరుస్తుండటంతో చుట్టుపక్కల ఉన్నవారు అసలేం జరుగుతుందా అని ఆరా తీశారు. చివరకు సదరు వ్యక్తి తమ ఇంటి బాల్కనీలో ఆవులను పెంచుతున్నాడన్న విషయం తెలుసుకొని అవాక్కయ్యారు. ఆవులు అరుపు, వాటి పేడ వాసన ఎక్కువ కావడంతో వెంటనే మున్సిపల్ అధికారులకు కంప్లైంట్ చేశారు. దీంతో జులై 14న అధికారులు ఆ గోవులను మరో చోటుకు తరలించారు. ఐదో అంతస్తులో ఆవులను పెంచుతున్న వీడియో ప్రస్తుతం చైనా సోషల్ మీడియా ప్లాట్ ఫాం డౌయిన్ లో చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోను ఇప్పటి వరకు 40లక్షల మంది చూశారు.

సదరు రైతు పెంచుకుంటున్న ఆవులన్నీ సైజులో చాలా చిన్నగా ఉన్నాయి. వాటి బరువు కూడా 10 నుంచి 20 కిలోల లోపే ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఇదిలా ఉంటే ఆవులను తీసుకెళ్లిన అధికారులపై సదరు రైతు అగ్గిమీద గుగ్గిలమవుతున్నాడు. తాము ప్రాణంగా పెంచుకుంటున్న గోవులను తిరిగి తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నాడు. మరోవైపు అదే అపార్ట్ మెంట్లో కొందరు కోళ్లను కూడా పెంచుతున్నారని, వాటి కూత భరించలేకపోతున్నామని మరికొందరు స్థానికులు అంటున్నారు. పచ్చని పల్లెవాతావరణంలో బతికే రైతులను అపార్ట్ మెంట్లలోకి తరలించడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 




Tags:    

Similar News