ఎక్కువసేపు ముద్దుపెట్టుకుంటున్నారా? అది పగిలిపోతుంది జాగ్రత్త!

Byline :  Lenin
Update: 2023-08-30 03:36 GMT

మనిషి అన్నాక కూసింత కళాపోషణ ఉండాలి. ప్రేమ అన్న తర్వాత ముద్దులు కచ్చితంగా ఉండాలి. పడచుజంటలే కాదు ముసలి జంటల మధ్య కూడా ముద్దూముచ్చటా ఉండాలి. అయితే ఏదైనాసరే శ్రుతి మించకూడదు. ముద్దుమురిపాలు ఎక్కువైతే పగిలిపోయి ఆస్పత్రికి పోక తప్పదు.

ప్రియురాలిని పట్టువదలకుండా గాఢంగా ముద్దుపెట్టుకుని స్వర్గంలో తేలిపోయిన ఓ యువకుడు ఆస్పత్రి పాలయ్యాడు. ఊపిరాడని ఉద్వేగంతో కర్ణభేరి పగిలి చెవుడు వచ్చింది. ఎదుటి మనుషులు మాట్లాడుతున్నదేమిటో అర్థం కాక బుర్ర గోక్కుంటూ సైగలతో నెట్టుకొస్తున్నాడు.. చైనాలోని జెజియాంగ్ రాష్ట్రం వెస్ట్‌లేక్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. డేటింగ్‌లో ఉన్న ఓ యువకుడు ఈ నెల 22న తన ప్రియురాలిని పదినిమిషాలపాటు విడవకుండా ముద్దుపెట్టుకున్నాడు. తర్వాత చెవులు పనిచేయక ఆస్పత్రికి వెళ్లాడు. ‘‘గాఢమైన ముద్దు వల్ల చెవిలోని గాలిలో ప్రెజర్ పెరిగింది. ప్రియురాలి భారమైన శ్వాస కూడా ఒత్తిడిపెంచి కర్ణభేరి పగిలిపోయింది. అతనికి చికిత్స చేస్తున్నాం. కోలుకోవడానికి రెండు నెలలు పడుతుంది’’ అని డాక్టర్లు చెప్పారు. ముద్దుల వల్ల చెవులు దెబ్బతినడం ఇదే మొదటిసారి కాదు. 2008లోనూ చైనాలో ఓ కుర్రాడు అతిగా ముద్దుపెట్టుకోవడంతో చెవుడు వచ్చింది.

Tags:    

Similar News