ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహం మోదీదే.. ఏమిటీ ప్రాజెక్ట్!
ప్రపంచంలో అత్యంత ఎత్తయిన విగ్రహం ఏదని అడిగితే ఏం చెబుతారు? గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అని కదా. వందలాది సంస్థానాలుగా చీలిపోయిన భారతదేశాన్ని ఐక్యం చేసిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ స్మారకార్థం ఆయన విగ్రహాన్ని అంత ఎత్తున నిలిపారు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొడుతూ మోదీ విగ్రహం కొత్త రికార్డు సృష్టించనుందట. స్టాచ్యూ ఆఫ్ యూనిటీకంటే ఎక్కువ ఎత్తులో, ప్రపంచంలో అత్యంత పెద్ద మోదీ విగ్రహాన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ కంపెనీ తెలిపింది.
డార్విన్ ప్లాట్‌ఫామ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఈ ప్రాజెక్టును చేపట్టనుంది. మోదీ భారత దేశానికి చేసిన సేవలకు గుర్తుంపుగా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు డార్విన్ ఫ్లాట్‌ఫామ్ తెలిపింది. మహారాష్ట్ర పుణలోని లావాసాలో మోదీ విగ్రహాన్ని ఏర్పాట్లు చేస్తామని కంపెనీ సీఎండీ అజయ్ హరినాథ్ సింగ్ తెలిపారు. ‘‘ మోదీ మన దేశ ఐక్యతను, సమగ్రతను కాపాడేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. ఆయన సేవలకు ఈ విగ్రహం గుర్తు’’ అని చెప్పారు. మోదీ విగ్రహాన్ని 190 మీటర్ల నుంచి 200 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. పటేల్ విగ్రహం ఎత్తు 182 మీటర్లే. పటేల్ విగ్రహం దగ్గర ఉన్నట్టే మోదీ బొమ్మ దగ్గర కూడా ఎగ్జిబిషన్, ఇతర కల్చరల్ ప్రాజెక్టులు కార్యక్రమాలు ఉంటాయని సమాచారం. మోదీ విగ్రహాన్ని 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తారని చెబుతున్నారు. అయితే ప్రాజెక్టు ఇంకా పట్టాలెక్కకపోవడంతో అది సాధ్యమేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.