'Galaxy Leader' : కార్గో షిప్ హైజాక్.. ఫుటేజీ విడుదల చేసిన హౌతీ రెబల్స్

Byline :  Mic Tv Desk
Update: 2023-11-21 05:00 GMT

టర్కీ నుంచి భారత్‌కు వస్తున్న కార్గో నౌక ‘గెలాక్సీ లీడర్‌’‌ను హౌతీ రెబల్స్ ఎర్ర సముద్రంలో హైజాక్‌ చేసిన విషయం తెలిసిందే. ఇజ్రాయేల్‌ సంపన్నుడు అబ్రహాంకి చెందిన ఈ నౌకను నడి సంద్రంలో హైజాక్‌ చేసి యెమెన్‌ తీరానికి తరలించారు. తాజాగా, దీనికి సంబంధించిన వీడియోను హౌతీ రెబెల్స్‌ విడుదల చేశారు. భారీ నౌకను రెబల్స్ ఎలా స్వాధీనం చేసుకున్నారో ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. సినిమాను తలపించేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్ చల్ చేస్తోంది.




 


సముద్రంలో 600 అడుగుల పొడవున్న భారీ నౌక కదులుతుండగా.. హెలికాప్టర్‌లో వచ్చిన కొందరు సాయుధులు దాని డెక్‌పై దిగారు. అనంతరం స్లోగన్స్‌ చేస్తూ.. గాలిలో కాల్పులు జరుపుతూ ఓడలోని సిబ్బందికి తుపాకులను ఎక్కుపెట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత చిన్న చిన్న పడవల్లో వచ్చి ఆ నౌకను చుట్టుముట్టారు. అనంతరం ఓడను పూర్తిగా తమ నియంత్రణలోకి తెచ్చుకున్నారు. హౌతీలు ఉపయోగించే యెమెన్ జెండాతో పాటు పాలస్తీనా జెండాను ఒకరు ఎగురవేశారు. అదే జెండాలు గెలాక్సీ లీడర్‌పై ఎగురుతున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హమాస్‌-ఇజ్రాయేల్‌ యుద్ధం నేపథ్యంలో ఆ దేశం, వారి మద్దతుదారుల నౌకలను లక్ష్యంగా చేసుకుంటామని హౌతీ తిరుగుబాటుదారులు గతంలో హెచ్చరించారు. ఈనేపథ్యంలో గెలాక్సీ లీడర్‌ నౌకను హైజాక్‌ చేసి.. యెమెన్ తీరానికి తీసుకెళ్లారు.




Tags:    

Similar News