Siti Hawa Hussin : పెళ్లి కావాలంటున్న 112ఏళ్ల బామ్మ.. కండీషన్స్ వింటే..

Byline :  Krishna
Update: 2024-01-13 03:26 GMT

ప్రేమ, పెళ్లికి వయస్సుతో సంబంధం లేదంటారు. కొంతమంది లేటు వయస్సులో ప్రేమలో పడితే.. మరికొంత మంది పెళ్లి చేసుకుంటారు. ఇక ముసలి వయస్సు వచ్చిందంటే.. కుటుంబసభ్యులు, మనుమళ్లు, మనమరాళ్లతో హాయిగా గడపాలనుకుంటారు. అయితే ఓ బామ్మ మాత్రం పెళ్లి కావాలంటోంది. ఇప్పుడు ఆమె వయస్సు 112ఏళ్లు.. పైగా ఆమెకు ఇప్పటికే 7 పెళ్లిళ్లు అయిపోయాయి. అంతేకాదు తనను చేసుకోవాలంటే కొన్ని కండీషన్స్ కూడా పెట్టింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది.




 

మలేషియాలోని తుంపట్ నగరంలో సితి హవా హుస్సిన్ అనే వృద్ధురాలు నివసిస్తోంది. 112 ఏళ్ల ఈ బామ్మకు ఇప్పటికే ఏడు పెళ్లిళ్లు అయ్యాయి. అందులో కొందరు చనిపోగా.. మరికొందరితో గొడవల వల్ల విడిపోయినట్లు బామ్మ చెప్పింది. ఈ బామ్మకు ఐదుగురు సంతానం కాగా.. 19 మంది మనవళ్లు, 30 మంది ముని మనవళ్లు ఉన్నారు. ప్రస్తుతం ఆమె తన చిన్న కుమారుడు అలీ (58)తో కలిసి ఉంటుంది. ఈ క్రమంలో తనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని ఉందనే చిలిపి కోరికను బామ్మ బయటపెట్టింది. ఓ వ్యక్తి వచ్చి తనకు ప్రపోజ్ చేస్తేనే పెళ్లి చేసుకుంటానని కండీషన్ కూడా పెట్టింది.




 

అదేవిధంగా తన జీవిత రహస్యాన్ని కూడా సితి హవా ప్రజలతో పంచుకుంది. సాధారణ ఆహారాన్ని మాత్రమే ఇష్టపడతానని చెప్పింది. తెల్ల అన్నం మాత్రమే తింటుందట. తినేటప్పుడు వాటర్ తాగనని చెప్పింది. అంతేకాకుండా రోజుకు 5 సార్లు నమాజ్ చేస్తుంది. తన సుదీర్ఘ జీవితానికి ఆహారపు అలవాట్లు, ప్రార్థనలే కారణమని ఆమె నమ్ముతోంది. ఈ వయస్సులోనూ తన పనులను తనే చేసుకుంటోంది. కాగా సితి హవా పెళ్లి కోరిక విని అందరూ అవాక్కవుతున్నారు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.


Tags:    

Similar News